ఇంత అభివృద్ధి జరుగుతున్నా చెప్పుకోరా?
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:31 AM
ప్రజల్లోకి వెళ్లరెందుకు? టీడీపీ శ్రేణులపై సీఎం చంద్రబాబు అసహనం
కుప్పం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘నీళ్లిచ్చాం. ఇండస్ట్రీస్ తెస్తున్నాం. యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. ఇంత అభివృద్ధి జరుగుతున్నా చెప్పుకునే వారే లేరు. ప్రజల్లోకి వెళ్లి ఎందుకు ప్రచారం చేయడం లేదు’ అంటూ టీడీపీ శ్రేణులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కుప్పం టీడీపీ శ్రేణులతో ఆదివారం సాయంత్రం చంద్రబాబు సుమారు గంటపాటు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ శ్రేణులసమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం ఏకరువు పెట్టారు. ఎక్కడో ఉన్న కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొచ్చి చెరువులను నింపాం. కరువుతో బీడుపడ్డ భూములను సశ్యామలం చేశాం. హంద్రీ-నీవా కాలువలో ప్రవహిస్తున్న నీటివల్ల భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య కూడా తీరిపోయింది. అయినా దీనికి రావాల్సినంత ప్రచారం రాలేదు. మీరు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు చెప్పుకోక పోవడమే అందుకు కారణం అని ఆక్షేపించారు. వేలకోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ఎన్నో పరిశ్రమలు ముందుకు వచ్చి కడా ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. పరిశ్రమలకు భూముల కేటాయింపు జరిగింది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు, ఏజెన్సీలు కార్యకలాపాలను ప్రారంభించాయి. అయినా మనం ఎందుకు ప్రచారం చేసుకోలేక పోతున్నాం అని అసంతృప్తి వ్యక్తం చేశారు. కుప్పం నుంచి యువత వలసలు తగ్గాయని, ఉపాధి సదుపాయాలు మెరుగుపడటమే దీనికి కారణమని పేర్కొన్నారు. నేను ముఖ్యమంత్రిగా తరచూ కుప్పం రాలేకపోవచ్చు. కానీ భువనేశ్వరి వస్తున్నారు కదా. ఆమెతోపాటు ప్రజల్లోకి వెళ్లండి. అభివృద్ధిని ప్రచారం చేయడంతోపాటు ప్రజలు ఇంకా ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోండి. తీర్చడానికి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు. మున్సిపాలిటీ చుట్టూ వేస్తున్న రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేసిన సంగతి గుర్తు చేశారు. ఇంకా రూ.15 కోట్లు మంజూరు చేస్తాను. వెంటనే రింగ్ రోడ్డు పూర్తిచేయండి అని ఆదేశించారు. కుప్పం పట్టణంలోని ప్రధాన రహదారి అయిన నేతాజీ రోడ్డు విస్తరణ పనులపై ఆరా తీశారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేశ్ బాబుతోపాటు నాలుగు మండలాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.