గజదాడులనుంచి ఉపశమనం దొరికేనా?
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:19 AM
మదపుటేనుగులను అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ పలమనేరు ప్రాంతంలో చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతం
చిత్తూరు సెంట్రల్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మదపుటేనుగులను అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ పలమనేరు ప్రాంతంలో చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇటు అటవీశాఖ అధికారుల్లో, అటు పంటలు, ప్రాణాలు నష్టపోతున్న రైతుల్లో ఉపశమనం కనబడుతోంది.‘ఆపరేషన్ కుంకీ’ ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తోపాటు అటవీశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా అటవీ శాఖాధికారులకు అభినందనలు వచ్చాయి.మే 21వ తేదీన కర్ణాటక నుంచి వచ్చిన నాలుగు కుంకీ ఏనుగులు పలమనేరు చేరాయి. ఇక్కడి వాతావరణానికి అవి అలవాటు పడటానికి నెల రోజులు పట్టింది.కుంకీలతో వచ్చిన కర్ణాటక మావటీలు ఏనుగులతోపాటు ఇక్కడి మావటీలకు నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఏనుగుల డ్రైవ్‌పై జిల్లా అటవీశాఖలో పనిచేస్తున్న 40మంది బెంగళూరులోని దుబేరా ఎలిఫెంట్ బేస్ క్యాంపులో శిక్షణ పొందారు. వీరిలో 17 మంది ఏనుగుల డ్రైవ్‌లో నైపుణ్యం సాధించారు. దీంతో కర్ణాటక మావటీలు వెళ్లిన తర్వాత శిక్షణ పొందిన 17 మంది మావటీలు కుంకీలకు శిక్షణ మొదలు పెట్టారు. నాలుగు కుంకీలను వారి ఆధీనంలోకి తెచ్చుకోడానికి మరో 40 రోజుల సమయం పట్టింది.కుంకీలకు, మావటీలకు మధ్య సమన్వయం కుదరడంతో ట్రయల్ రన్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. డీఎ్‌ఫవో భరణి సూచనలతో ఆగస్టు 1న కుంకీలకు పరీక్షలు నిర్వహించారు. వాటి శారీరక ధృడత్వం వంటివి పరిశీలించాక మూడు ఏనుగులు మాత్రమే ఫిట్ కావడంతో వాటితోనే శనివారం ట్రయల్‌రన్ ఆపరేషన్ చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టేకుమంద ప్రాంతంలో తిరుగుతున్న 8 ఏనుగులపై కుంకీలైన కృష్ణ, జయంత్, వినాయక్‌లను ప్రయోగించారు. ముగ్గురు మావటీలు కుంకీలను అటువైపు తీసుకుపోయి, అటవీ ప్రాంతంలోని ఏనుగులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడంతోపాటు అటవీ ప్రాంతంలోకి మళ్లించగలిగారు.
జిల్లాలో 90 ఏనుగులు
చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతమైన కారుణ్య అభయారణ్యంలో ప్రస్తుతం 90 ఏనుగులున్నట్లు అటవీ శాఖ అధికారులు లెక్కలు కట్టారు. వీటిలో 18 ఏనుగుల గుంపు పులిచెర్ల మండలంలో, 13 ఏనుగుల గుంపు పలమనేరు, బంగారుపాళ్యంలో సంచరిస్తున్నాయి.పలమనేరులో ఒంటరి ఏనుగు, కల్లూరులో రెండు మదపుటేనుగుల సంచారం ఉందని గుర్తించారు.
సంచార ప్రాంతాల్లోనే ఆపరేషన్ కుంకీ...
ఏనుగులు నిత్యం సంచరించే ప్రాంతాల్లో కుంకీ ఏనుగులతో డ్రైవ్ చేపట్టాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. పలమనేరులోని గవిని చెరువు, ముసలిమడుగు, పులిచెర్ల మండలంలోని కల్లూరు, పాళ్యం, దేవళంపేట, కమ్మపల్లె, పాతపేట, చల్లావారిపల్లె, బోడిరెడ్డిగారిపల్లె, మంగళంపేట, గుడిపాల మండలంలోని చిత్తపార, కమ్మపల్లె, బొమ్మసముద్రం, పుంగనూరు మండలంలోని ఆవులపల్లె, రాంపల్లె, గంటావారిపల్లె, గురికానవారిపల్లె, చెరుకువారిపల్లె, బంగారుపాళ్యం మండలంలోని రాగిమానుపెంట, బోడబండ్ల, ఐరాల మండలంలోని నాగవాండ్లపల్లె, గుండ్లపల్లె, నాంపల్లె ప్రాంతాల్లో కుంకీ ఆపరేషన్లు నిర్వహించనున్నారు.
రోజుకు ఆరు గంటలే
రోజుకు కేవలం ఆరు గంటలు మాత్రమే కుంకీ ఏనుగులను ఆపరేషన్‌కు వినియోగించాల్సి ఉంటుంది. రోజూ వాటికి దాదాపు 250 కిలోల ఆహారం (గడ్డి, రాగిసంగటి, వరి, చెరకు) అందించాలి. ఆపరేషన్ చేపట్టే ముందు కుంకీ ఏనుగులకు కడుపు నిండా ఆహారం పెట్టాలి. ఎక్కువ దూరం కుంకీ ఏనుగులను నడిపించే వీలులేదు. వాటి శరీర దృఢత్వ ఆధారంగా 10 నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేపట్టాల్సి ఉంది. కుంకీ ఏనుగులను నడిపించేందుకు ప్రధాన మావటీలతోపాటు శిక్షణ పొందిన మావటీలు సైతం కావాల్సి ఉంది. కుంకీ ఏనుగులు ఏ క్షణంలోనైనా వింతగా ప్రవర్తించినా, మావటీల కమాండ్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినా, వాటిని తక్షణం అదుపులోకి తెచ్చుకునేందుకు ఇతర మావటీలు సహాయ పడాల్సి ఉంది. ఇదే క్రమంలో ఒక్కోసారి మదపుటేనుగులు కుంకీలపై తిరగబడే పరిస్థితుల్లో వాటి బారినుంచి మావటీలు కుంకీలను కాపాడాల్సిన అవసరం ఉంది.
అప్రమత్తం అవసరం
ఏనుగులు నిత్యం సంచరించే అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బందితో పాటు రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలి. ఏనుగుల సంచారం గుర్తించిన వెంటనే, కుంకీలు ఆ ప్రాంతానికి చేరుకునే వరకు గ్రామాల వైపు ఏనుగులు రాకుండా అటవీ సిబ్బంది చూసుకోవాల్సి ఉంది. కుంకీ ఏనుగులు ఎక్కువ దూరం నడిపించే వీలు లేనందున, ననియాల నుంచి ఆపరేషన్ నిర్వహించే ప్రాంతానికి వాహనంలో రవాణా చేయాల్సి వుంది.
కల్లూరు-ఐరాల ప్రాంతాల్లో సెకండ్ డ్రైవ్
ఆపరేషన్ కుంకీ విజయవంతమైన క్రమంలో కల్లూరు-ఐరాల అటవీ ప్రాంతాల్లో సెకండ్ డ్రైవ్ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే కల్లూరు ప్రాంతంలో సోలార్ రిఫ్లెక్టర్ లైట్లు అమర్చిన క్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల ఏనుగులను కల్లూరు-ఐరాల మధ్య ప్రాంతాల్లోని అడవుల్లోకి చేర్చి, అక్కడి నుంచి కౌండిన్య అభయారణ్యంలోకి పంపి, అవి తిరిగి జనారణ్యంలోకి రాకుండా చర్యలు తీసుకుంటాం.
-డీఎ్‌ఫవో భరణి