కుప్పంలో క్యాంపు రాజకీయాలు!
ABN , Publish Date - Apr 25 , 2025 | 02:14 AM
వైసీపీనుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నలుగురు కౌన్సిలర్లను కలుపుకుని అధికార పార్టీకి మొత్తం 10 మంది కౌన్సిలర్లు, వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవితోపాటు కౌన్సిలర్ పదవికి కూడా డాక్టర్ సుధీర్ రాజీనామా చేశాక 16వ వార్డు ఖాళీగానే ఉంది. దీనికి ఇప్పట్లో ఎన్నికలు ప్రకటించక పోవడంతో ప్రస్తుతానికి 24 మంది మాత్రమే కౌన్సిల్‌లో ఉన్నారు. చైర్మన్ ఎన్నికల్లో ఈ 24 మందితోపాటు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భరత్‌లకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు కలిగి ఉంటారు. ఈ లెక్కన తీసుకుంటే ఈ ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులతోపాటు 24 మంది కౌన్సిలర్లు కలిపి మొత్తం 27 మందికి మున్సిపల్ కౌన్సిల్‌లో ఓటు హక్కు దఖలు పడుతుంది. కోరం ఉండాలంటే కనీసం 14 మంది సభ్యులు కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలి. ఇక్కడే అధికార టీడీపీ ప్రస్తుతానికి చిక్కులు ఎదుర్కొంటోంది.
- టీడీపీలో తేలని చైర్మన్‌గిరీ
- వైసీపీలో చక్రం తిప్పుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి
కుప్పంలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కుప్పం మున్సిపల్ చైర్మన్ గిరీకోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు పైఎత్తులకు తలపడడం ప్రారంభించాయి. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఈనెల 28వ తేదీన జరగాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
- కుప్పం, ఆంధ్రజ్యోతి
వైసీపీనుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నలుగురు కౌన్సిలర్లను కలుపుకుని అధికార పార్టీకి మొత్తం 10 మంది కౌన్సిలర్లు, వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవితోపాటు కౌన్సిలర్ పదవికి కూడా డాక్టర్ సుధీర్ రాజీనామా చేశాక 16వ వార్డు ఖాళీగానే ఉంది. దీనికి ఇప్పట్లో ఎన్నికలు ప్రకటించక పోవడంతో ప్రస్తుతానికి 24 మంది మాత్రమే కౌన్సిల్‌లో ఉన్నారు. చైర్మన్ ఎన్నికల్లో ఈ 24 మందితోపాటు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భరత్‌లకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు కలిగి ఉంటారు. ఈ లెక్కన తీసుకుంటే ఈ ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులతోపాటు 24 మంది కౌన్సిలర్లు కలిపి మొత్తం 27 మందికి మున్సిపల్ కౌన్సిల్‌లో ఓటు హక్కు దఖలు పడుతుంది. కోరం ఉండాలంటే కనీసం 14 మంది సభ్యులు కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలి. ఇక్కడే అధికార టీడీపీ ప్రస్తుతానికి చిక్కులు ఎదుర్కొంటోంది.
రహస్య శిబిరాలు
అధికార, ప్రతిపక్ష పార్టీలు కౌన్సిల్‌పై పట్టుకోసం క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. టీడీపీకి చెందిన మొత్తం 10 మంది సభ్యుల్లో ఒకరిద్దరు తప్ప మిగిలినవారంతా గురువారం ఉదయానికల్లా రహస్య క్యాంపులకు వెళ్లిపోయారు. వీరి వ్యవహారాలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్థానికంగానే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వైసీపీలోని ఒకరిద్దరు కౌన్సిలర్లు తప్ప.. మిగిలిన వారిని ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక క్యాంపునకు తరలించారు. రెండు శిబిరాలు ఎన్నికలకోసం మోహరించాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో కలిసి టీడీపీకి ప్రస్తుతం 11 మంది కౌన్సిలర్లు ఉన్నట్టు లెక్క. కోరం ఉండాలంటే మరో ముగ్గురు కౌన్సిలర్లు అవసరమవుతారు. ఈ ముగ్గురిని తప్పనిసరిగా వైసీపీనుంచే తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకోసం మూడు గ్రూపులుగా విడిపోయిన టీడీపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే వీరి ప్రయత్నాలు ఫలించినట్లు సమాచారం. ఇక వైసీపీ కూడా ఒక్కరిని కూడా చేయిజారి పోకుండా చూడాలని జాగ్రత్త చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ముప్పావువంతుపైగా కౌన్సిలర్లను రెండు గ్రూపులుగా రహస్య శిబిరాలకు తరలించారు. మిగిలిన ఒకరిద్దరిపై సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నట్టు చెబుతున్నారు.
సీల్డ్ కవరే ఫైనల్
ఎలాగైనా సరే, మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకుంటామన్న ధీమా అధికార టీడీపీలో కనిపిస్తోంది. అందుకే, ఈ పార్టీలో ఆ సీటుకోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. 19వ వార్డు కౌన్సిలర్ జిమ్ దాము, 20 వార్డు కౌన్సిలర్ ఎస్.సోమశేఖర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ కూడా రంగంలో ఉన్నారు. రెండ్రోజుల కిందట ఒక టీడీపీ ముఖ్య నేత ఇంట్లో జరిగిన సమావేశానికి టీడీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు హాజరైనట్లు తెలిసింది. చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఇద్దరు కౌన్సిలర్ల తరఫునుంచి వాదనలు జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో తేల్చుకోవాలన్న నిర్ణయంతో సమావేశం ముగిసింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ బుధవారం రాత్రి కుప్పానికి చేరుకోగానే వైసీపీనుంచి వచ్చిన నలుగురు, మొదటినుంచీ టీడీపీలోనే కొనసాగుతున్న ఆరుగురు కౌన్సిలర్లతో విడివిడిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని, ఈ విషయంలో వాదోపవాదాలకు తావులేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. మున్సిపల్ చైర్మన్‌గిరీ ఎవరిని వరించనుందన్న విషయంలో అధికార టీడీపీలో ఆదివారం సాయంత్రం దాకా సస్పెన్సు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీనుంచి ప్రస్తుత వైస్ చైర్మన్ హఫీజ్, మరో కౌన్సిలర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి పర్యవేక్షణలోనే ఆ పార్టీ కౌన్సిలర్ల శిబిరాలు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.