తుఫాన్ నష్టాన్ని లెక్కించండి
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:39 AM
మొంథా తుఫాన్ వల్ల జిల్లాలో జరిగిన నష్టాన్ని లెక్కించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
పునరావాస కేంద్రాలకు నిత్యావసరాలు అందించాలన్న కలెక్టర్
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ వల్ల జిల్లాలో జరిగిన నష్టాన్ని లెక్కించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తుఫాన్ నష్టపరిహార గణన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. బురద, చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు క్లోరినేషన్ చేయాలని తెలిపారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. చెరువులు, కాజ్‌వేలు వద్ద వరద ప్రవాహం తగ్గే వరకు పర్యవేక్షిస్తుండాలన్నారు. గుంతలు ఏర్పడిన చోట రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు నిత్యావసర సరుకులు, ప్రతి కుటుంబానికీ రూ.3వేలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరో నాలుగు రోజులు బీచ్‌లు, చెరువుల వద్దకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో నరసింహులు, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు పాల్గొన్నారు.