ఎర్రచందనం స్టాక్ పాయింట్‌గా బైరెడ్డిపల్లె!
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:22 AM
ఎర్రచందనం స్టాక్ పాయింట్‌గా బైరెడ్డిపల్లెను స్మగ్లర్లు వాడుకుంటు న్నట్లు తాజాగా బయటపడింది. తిరుపతి పరిసరాలనుంచి సేకరించిన ఎర్రచందనం దుంగలను బైరెడ్డిపల్లె మండలం మీదుగా కర్ణాటకకు స్మగ్లింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
రైతు ఇంట్లో దాచిన రూ.50 లక్షల సరుకు పట్టివేత
పలమనేరు, ఆగస్టు 11 (ఆంఽధ్రజ్యోతి): ఎర్రచందనం స్టాక్ పాయింట్‌గా బైరెడ్డిపల్లెను స్మగ్లర్లు వాడుకుంటు న్నట్లు తాజాగా బయటపడింది. తిరుపతి పరిసరాలనుంచి సేకరించిన ఎర్రచందనం దుంగలను బైరెడ్డిపల్లె మండలం మీదుగా కర్ణాటకకు స్మగ్లింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు బైరెడ్డిపల్లె మండలానికి చెందిన ఇద్దరు సహకారం అందిస్తున్నట్లు చెబుతున్నారు. కర్ణాటక సరిహద్దులో పలమనేరు రేంజి పరిధిలోని బైరెడ్డిపల్లె మండలం ఆలప్పల్లి కొత్తూరు సమీపంలో పొలం వద్ద ఉన్న ఒక రైతుకు చెందిన ఇంటిలో దాచి వుంచిన రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పట్టుకొన్నట్లు పలమనేరు సబ్ డీఎ్‌ఫవో వేణుగోపాల్ వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు రేంజర్ నారాయణ, సిబ్బందితో కలిసి వెళ్లి దాచి వుంచిన 144 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు.ఎంతో కాలంగా ఎర్రచందనం ఇక్కడ నిల్వచేసి అదను చూసి బెంగళూరు, చెన్నె నగరాలకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతి నుంచి చెన్నె వెళ్లే రహదారులపై పోలీసు, అటవీశాఖ అధికారుల నిఘా ఎక్కువగా వున్నందున స్మగ్లర్లు బైరెడ్డిపల్లె మండలాన్ని స్టాక్ పాయింట్‌గా ఎంపిక చేసుకోవడంతో పాటు ఇక్కడి ప్రముఖుల సహకారాన్ని కూడా పొందారని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.గతంలో అక్రమ రవాణాకు పేరుగాంచిన వ్యక్తే ఇక్కడా ముఖ్యుడై వుండవచ్చన్న కోణంలో కూడ అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. బైరెడ్డిపల్లె మండలం అటు కర్ణాటకకు, ఇటు తమిళనాడు సరిహద్దుకు అత్యంత సమీపంలో వుంది. కేవలం ఒక కిలోమీటరు వెళ్తే పొరుగురాష్ట్రాల్లోకి చేరే అవకాశం ఉన్నందున మద్యం, ఇసుక, స్మగ్లర్లకు ఈ మండలం అత్యంత సౌకర్యవంతంగా వుంది. అందువల్లే ఇక్కడకు వచ్చే పోలీసు పోస్టింగ్‌లకు గట్టిపోటీ వుంటోంది.