‘తోతాపురి’ని మద్దతు ధరతో కొనండి
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:06 AM
తోతాపురి రకం మామిడి కాయలను మద్దతు ధరతో కొనాలంటూ మంగళవారం మధ్యాహ్నం రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కిలోపై రాయితీ రూ.4 ఇస్తుండగా, రూ.8కి కొనాలని కోరారు. దామలచెరువులో మ్యాంగోనగర్‌లో సోమవారం ఉదయం రూ.6 వంతున కొన్నారు. సాయంత్రం రూ.4 ధర చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం తక్కువ మంది రైతులే ట్రాక్టర్లలో మామిడి కాయలు తీసుకొచ్చారు. ర్యాంపుల్లో దళారులు రూ.4 ధర చెప్పడంతో ఆగ్రహిస్తూ చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారి హైస్కూల్ గేటులో రోడ్డుపై బైఠాయించారు.
- దామలచెరువులో మామిడిరైతుల ధర్నా.. జాతీయ రహదారిపై బైఠాయిపు
పాకాల, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): తోతాపురి రకం మామిడి కాయలను మద్దతు ధరతో కొనాలంటూ మంగళవారం మధ్యాహ్నం రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కిలోపై రాయితీ రూ.4 ఇస్తుండగా, రూ.8కి కొనాలని కోరారు. దామలచెరువులో మ్యాంగోనగర్‌లో సోమవారం ఉదయం రూ.6 వంతున కొన్నారు. సాయంత్రం రూ.4 ధర చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం తక్కువ మంది రైతులే ట్రాక్టర్లలో మామిడి కాయలు తీసుకొచ్చారు. ర్యాంపుల్లో దళారులు రూ.4 ధర చెప్పడంతో ఆగ్రహిస్తూ చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారి హైస్కూల్ గేటులో రోడ్డుపై బైఠాయించారు. ర్యాంపు యజమానులు, సప్లయర్స్ ఫ్యాక్టరీలు కిలోకు రూ.8 ఇస్తే ప్రభుత్వం రూ.4 ఇస్తుందని ప్రకటించినా ఫ్యాక్టరీలు కొనడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో దళారులు సిండికేట్ అయి ర్యాంపుల్లో తక్కువ ధరకు కొని.. అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సీఎం, కలెక్టర్లు మద్దతు ధరకు కొనాలని ప్రకటించినా దళారుల వ్యవస్థతో ఫలితం లేకుండా పోతోందన్నారు. తోటల్లో పక్వానికి వచ్చిన మామిడి కాయలు రాలిపోతున్నాయని, వెంటనే కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తహసీల్దారు సంతో్‌షసాయి, సీఐ సుదర్శన ప్రసాద్, ఉద్యాన అధికారిణి శైలజ రైతులతో చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సప్లయర్స్ మద్దతు ధరకు కొనాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ధర్నాతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రైతులు ధర్నా విరమించారు. ఆ తర్వాత బయట వ్యాపారులు రూ.6 చొప్పున కొని తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రభుత్వ మద్దతు ధరకు మామిడి కొనకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.