స్విమ్స్‌లో మెడికల్ మాఫియాకు బ్రేక్..!
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:35 AM
స్విమ్స్‌లో మెడికల్ మాఫియాకు బ్రేక్ పడనుంది. లాభాపేక్ష లేకుండా సొంతంగానే మెడికల్ షాపు నిర్వహించేలా టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
పద్మావతి ఆస్పత్రి మెడికల్ షాపు రద్దుకు నిర్ణయం
లాభాపేక్ష లేకుండా సొంతంగా నిర్వహించేందుకు కసరత్తు
తిరుపతి, ఆంధ్రజ్యోతి
స్విమ్స్‌లో మెడికల్ మాఫియాకు బ్రేక్ పడనుంది. లాభాపేక్ష లేకుండా సొంతంగానే మెడికల్ షాపు నిర్వహించేలా టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో పులివెందుల పెత్తనం స్విమ్స్‌లో చాపకింద నీరులా పాకింది. శ్రీపద్మావతి ఆస్పత్రి వద్ద నామమాత్రపు అద్దెతో షాపును దక్కించుకుని లక్షలాది రూపాయలు ఆర్జించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా సదరు షాపునకు టెండరు జరిగినప్పటికీ మాఫియా ఉచ్చులో నుంచి బయటకు రాలేకపోయింది. ఈ పరిణామాలపై ‘ఆంధ్రజ్యోతి’ పలుసార్లు కథనాలను ప్రచురించింది. ఈ క్రమంలో షాపును రద్దు చేసేందుకు టీటీడీ సిద్ధమైంది.
మాఫియాకు షాక్
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జనఔషధి మెడికల్ షాపుల పేరిట అప్పటి టీటీడీ ఛైర్మన్లు వారి అనుచరులకు చెరో మెడికల్ షాపులు నామమమాత్రపు అద్దెకు కట్టబెట్టారన్న విమర్శలు వచ్చాయి. వాటిని రద్దుచేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. స్విమ్స్ ఓపీల వద్ద ఉండే షాపును రద్దుచేయగలిగారు గాని పద్మావతి ఆస్పత్రి వద్ద ఉన్న మెడికల్ షాపును మాత్రం కదిలించలేకపోయారు. టీటీడీ మూడుసార్లు టెండర్లు పిలిచింది. అసాధారణ నిబంధనలు పెట్టడం వలన టెండరులో పాల్గొనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తిచూపలేదు. తాజాగా ఆగస్టులో నాలుగోసారి టెండరు పిలిచారు. ఇందులో ఎక్కువ ధరకు కోట్ చేసిన ఇన్నోవేటివ్ ఫార్మా అధిక బిడ్డర్‌గా అర్హత సాధించింది. అయితే టెండరు జరిగి నెలరోజులు దాటినా అధిక బిడ్డర్‌కు కేటాయించకుండా మాఫియా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ నిర్ణయం అమలులోకి వస్తే మాఫియాకు చెక్ పడినట్టేనని చెప్పుకోవచ్చు.