Share News

పరమసముద్రం చెరువులో బాలుడి గల్లంతు

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:20 AM

కృష్ణా జలాలతో నిండుకుండలా తొణికిసలాడుతున్న పరమసముద్రం చెరువులో యువన్‌ శేఖర్‌ (17) అనే యువకుడు శుక్రవారం గల్లంతయ్యాడు

పరమసముద్రం చెరువులో బాలుడి గల్లంతు
విలపిస్తున్న యువన్‌ శంకర్‌ తండ్రి వెంకటేశ్‌ను ఓదారుస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల (ఇన్‌సెట్‌లో) - గల్లంతైన యువకుడు యువన్‌ శేఖర్‌

కుప్పం, సెప్టెంబరు 5 (ఆంరఽధజ్యోతి): హంద్రీనీవా కాలువలో తరలివస్తున్న కృష్ణా జలాలతో నిండుకుండలా తొణికిసలాడుతున్న పరమసముద్రం చెరువులో యువన్‌ శేఖర్‌ (17) అనే యువకుడు శుక్రవారం గల్లంతయ్యాడు. కుప్పం అర్బన్‌ సీఐ శంకరయ్య కథనం మేరకు....కుప్పం పురపాలక సంఘం పరిధిలోని పరమసముద్రం గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కుమారుడు యువన్‌ శేఖర్‌ శాంతిపురంలో ఐటీఐ చదువుతున్నాడు. మిలాడి ఉన్‌ నబీ సందర్భంగా కళాశాలకు సెలవు కావడంతో శుక్రవారం ఉదయం ఈత కొట్టేందుకు పరమసముద్రం చెరువుకు వచ్చాడు. ముగ్గురు స్నేహితులు కలిసి నిండిన చెరువులో సరదాగా ఈత కొడుతూ పోటీలు పడి లోపలివైపు వెళ్లారు.కొంతసేపటికి తిరిగి ఒడ్డుకు చేరుకున్న ఇద్దరు స్నేహితులు యువన్‌ శేఖర్‌ బయటకు రాకపోవడంతో అతని తండ్రికి సమాచారం ఇచ్చారు. మరోవైపు సమాచారం అందుకున్న కుప్పం అర్బన్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రానికి కూడా యువన్‌ శేఖర్‌ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, రెస్కో చైర్మన్‌ వీజీ.ప్రతాప్‌, టీడీపీ మున్సిపల్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ తదితరులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు.యువన్‌ శేఖర్‌ తల్లిదండ్రులను ఓదార్చారు.

రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి దుర్మరణం

- ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు

పూతలపట్టు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పాకాల మండలం గుండ్లకట్టమంచికి చెందిన ఉమాపతి కుమారుడు హరి (34) చిత్తూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. రాత్రి 11.35 గంటలకు పూతలపట్టు మండలంలోని ముత్తిరేవుల బ్రిడ్జి వద్దకొచ్చేసరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హరి అక్కడికక్కడే మృతి చెందాడు. ముందు వెళుతున్న బైక్‌లోని ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూతపట్టు సీఐ కృష్ణమోహన్‌ సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:20 AM