బోయ‘కొండంత’ రద్దీ
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:32 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునే ఆలయ అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, పంచామృతాలతో అభిషేకాలు చేశారు.
- అమ్మవారిని దర్శించుకున్న 20 వేల మంది భక్తులు
చౌడేపల్లె, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునే ఆలయ అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. స్వర్ణాభరణాలు, పూలతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచేగాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యూలలో రద్దీ కొనసాగింది. దాదాపు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. వివిధ సేవ టికెట్ల ద్వారా రూ.10.50 లక్షల ఆదాయం చేకూరినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈవో ఏకాంబరం ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో కొండకు వెళ్లే దారిలో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు మూడు గంటల పాటు భక్తులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. గతంలో ఆదివారం రద్దీని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆలయ సిబ్బందిని నియమించి ట్రాఫిక్‌ను నియంత్రించేవారు. ప్రస్తుతం ఆ ఏర్పాట్లు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.