Share News

అటు అవగాహన.. ఇటు జరిమానా

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:47 AM

హెల్మెట్‌ ధరించని 432 మందిపై కేసులు ఒక్కొక్కరికి రూ.వెయ్యి అపరాధం

అటు అవగాహన.. ఇటు జరిమానా
పోలీసుల ద్విచక్ర వాహనాల ర్యాలీలో ముందు సాగుతున్న ఎస్పీ, కలెక్టర్‌

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): హెల్మెట్‌పై ఒక పక్క అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు కేసులూ నమోదు చేశారు. జరిమానా విధించారు. ఇలా సోమవారం నుంచి జిల్లాలో హెల్మెట్‌ తప్పనిసరి అనేది అమలు చేశారు. ఉదయం నుంచే పెట్రోల్‌ బంకుల వద్దకు చేరిన పోలీసులు హెల్మెట్‌ లేని వారికి పెట్రోల్‌ పట్టకుండా వెనక్కి పంపారు. పలువురిపై కేసులూ నమోదు చేశారు. కొన్నిచోట్ల హెల్మెట్‌ లేకున్నా పెట్రోల్‌ పట్టారు. ఈ విషయం తెలిసి నిర్వాహకులను పోలీసులు మందలించారు. పోలీసులు కూడా ఎక్కువగా పెట్రోల్‌ బంకుల వద్దే దృష్టి పెట్టారు. ఆదివారంతో పోలిస్తే హెల్మెట్‌ వేసుకున్న వారి సంఖ్య పెరిగింది. హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తూ సోమవారం తిరుపతిలోని పోలీసుశాఖ ఆధ్వర్యంలో రిజర్వు పోలీసు మైదానం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు బైకు నడపగా, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ వెనక కూర్చుని ర్యాలీలో ముందు సాగారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవిమనోహరాచ్చారి, శ్రీనివాసులు, నాగభూషణం, డీఎస్పీలు భక్తవత్సలం, వెంకటనారాయణ, ప్రసాద్‌, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

దండం పెట్టి చెబుతున్నాం..

బైకు ముందు ట్యాంకుపై కొందరు.. వెనక మరికొందరు హెల్మెట్లు పెట్టుకుని అలిపిరి వద్దకు చేరుకున్నారు. చెక్‌పాయింట్‌ వద్ద హెల్మెట్‌ వేసుకుని తిరుమలకు వెళ్లేలా వచ్చారు. వీరిని అలిపిరి ఆర్చి వద్ద తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా శాఖ అధికారులు, విజిలెన్సు సిబ్బంది ఆపారు. ‘మీకో దండం. మీ కుటుంబం.. మీ భవిష్యత్తు కోసం హెల్మెట్‌ ధరించండి. మొబైల్‌ ఫోన్‌ కొంటే టెంపర్‌ గ్లాసు, పౌచ్‌ వేసి చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లే మీ జీవితాన్ని అంతేస్థాయిలో కాపాడుకోండి’ అంటూ తిరుమల సీఐ హరిప్రసాద్‌, ఏవీఎస్వో రమేష్‌ తదితరులు దండం పెడుతూ విజ్ఞప్తి చేశారు.

జిల్లా అంతటా తనిఖీలు

జిల్లాలోని 29 ప్రాంతాల్లో సోమవారం పోలీసులు తనిఖీ చేశారు. హెల్మెట్‌ ధరించని 432 మందిపై కేసులు నమోదు చేశారు. రూ.వెయ్యి వంతున ఈ- చలానా ద్వారా జరిమానా విధించారు.

చట్ట భయంతో కాదు..

వేగం, నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణ నష్టం అధికంగా జరుగుతోంది. హెల్మెట్‌ ధరించడం వల్ల తీవ్ర ప్రమాదాల్లోనూ ప్రాణాలను కాపాడుకోవచ్చు. చట్ట భయంతో కాదు.. కుటుంబ భవిష్యత్తు కోసం హెల్మెట్‌ ధరించండి. మీ ఒక్క నిర్లక్ష్య నిర్ణయం తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణం కావచ్చు. మీ మంచి నిర్ణయం వారి జీవితానికే భరోసా అవుతుంది.

- వెంకటేశ్వర్‌, కలెక్టర్‌

మీ ప్రాణ రక్షణకే

హెల్మెట్‌ ధరించడం పోలీసుల కోసం కాదు. మీ ప్రాణాల రక్షణకే. రోడ్డు ప్రమాద మృతుల్లో 18 నుంచి 35 ఏళ్లవారే ఎక్కువ. వీరిలోనూ హెల్మెట్‌ లేక ప్రాణాలు కోల్పోతున్న వారే అధికం. సోషల్‌ మీడియా రీల్స్‌, వీడియోల కోసం నిర్లక్ష్యంగా బైక్‌ నడపకుండా జీవిత విలువను గుర్తించాలి. మీ స్నేహితుడు హెల్మెట్‌ లేకుండా బైక్‌ ఎక్కితే అతడిని ఆపడమే నిజమైన స్నేహం అవుతుంది.

- సుబ్బరాయుడు, ఎస్పీ

Updated Date - Dec 16 , 2025 | 12:47 AM