Share News

ముక్కంటి ఆలయ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి బూతుల దండకం

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:45 AM

శ్రీకాళహస్తీశ్వరాలయ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చంద్ర.. ధర్మరాజుల గుడి వద్ద శుక్రవారం సాయంత్రం బూతుల దండకంతో రెచ్చిపోయాడు. దీనిపై ఈవోకు ఫిర్యాదు చేసేందుకు భద్రతా సిబ్బంది సంతకాలు సేకరించారు.

ముక్కంటి ఆలయ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి బూతుల దండకం

మహిళా భద్రతా సిబ్బందిపై దౌర్జన్యం

శ్రీకాళహస్తి, జూలై 4(ఆంఽఽధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చంద్ర.. ధర్మరాజుల గుడి వద్ద శుక్రవారం సాయంత్రం బూతుల దండకంతో రెచ్చిపోయాడు. దీనిపై ఈవోకు ఫిర్యాదు చేసేందుకు భద్రతా సిబ్బంది సంతకాలు సేకరించారు. తొలి నుంచీ ఇతడిపై తీవ్ర ఆరోపణలున్నాయి. గతంలో ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ హుండీ లెక్కింపు సందర్భంగా చోరీకి పాల్పడి రెడ్‌హ్యాండెడ్‌గా చంద్ర పట్టుబడ్డాడు. అప్పట్లో కేసు నమోదై జైలుకూ వెళ్లాడు. వైసీపీ హయాంలో డిప్యూటీ ఈవోగా ఉన్న కృష్ణారెడ్డి.. ఇతడిని తిరిగి సెక్యూరిటీ గార్డుగా నియమించి తనకు వ్యక్తిగత సహాయకుడిగా నాలుగేళ్ల పాటు ఉపయోగించుకున్నారు. హుండీ దొంగను తిరిగి సెక్యూరిటీ గార్డుగా నియమించారనే విమర్శలతో పక్కన పెట్టారు. గతేడాది ఎన్నికలకు ఆరునెలల ముందు దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో తిరిగి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా చంద్ర చేరాడు. నర్సింగ్‌ కళాశాలలో వ్యాన్‌ డ్రైవర్‌కు సహాయకుడిగా పని చేయాల్సిన ఇతడు.. నిత్యం ముక్కంటి ఆలయంలోనే ఉండేవాడు. భక్తుల నుంచి నగదు వసూలు చేసి దర్శనాలకు తీసుకెళ్తుండడంతో కొందరు సిబ్బంది ఇటీవల నిలదీసినా.. పట్టించుకోలేదు. శుక్రవారం సాయంత్రం ధర్మరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో అర్జున వేషధారి తాటిచెట్టుపై నుంచి నిమ్మకాయలు విసిరే సమయంలో వందలాదిమంది భక్తులు చుట్టుముట్టారు. వారిని కట్టడి చేసేందుకు ఆలయభద్రతా సిబ్బంది అర్జున ప్రాధారిని ఆలయంలోపల గదిలోకి రక్షణ వలయంగా ఏర్పడి తీసుకెళ్లారు. ఈ సమయంలో తనను అర్జున వేషధారి వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారన్న ఆగ్రహంతో చంద్ర బూతుల దండకంతో ఆలయ ప్రాంగణంలోనే రెచ్చిపోయాడు. మహిళా భద్రతాసిబ్బందిని తోస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ 18 మంది మహిళా సెక్యూరిటీ గార్డులు ఈవో బాపిరెడ్డికి ఫిర్యాదు చేసేందుకు సంతకాలు సేకరించారు. రాత్రి అయిపోవడంతో మరికొందరి సంతకాలతో కలిపి ఈవో, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయ్యారు.

Updated Date - Jul 05 , 2025 | 01:45 AM