ఇస్కాన్‌కు బాంబు బెదిరింపు
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:03 AM
తిరుపతి నగరంలోని ఇస్కాన్ ఆలయంతోపాటు మరో రెండు ప్రాంతాల్లో ఆర్‌డీఎక్స్ బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పోలీసులకు ఈ-మెయిల్స్ వచ్చాయి.
- తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో ఆర్‌డీఎక్స్ పెట్టామంటూ మెయిల్స్
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలోని ఇస్కాన్ ఆలయంతోపాటు మరో రెండు ప్రాంతాల్లో ఆర్‌డీఎక్స్ బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పోలీసులకు ఈ-మెయిల్స్ వచ్చాయి. తమిళనాడు రాష్ట్రం కరూర్ ఘటనను సీబీఐకి అప్పగించాలని అందులో పేర్కొంటూ డిప్యూటీ ఈవో డోనర్ సెల్.తిరుమల.ఓఆర్‌జీ పేరుతో, ఇస్కాన్ తిరుపతి పేరుతో మెయిల్స్ వచ్చాయి. శబరీష్ వేదమూర్తి పేరుతో మెయిల్ వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో మెయిల్స్ రావడంతో డీఎస్పీ భక్తవత్సలం ఆదేశాల మేరకు అలిపిరి సీఐ రాంకిషోర్, ఎస్‌ఐ నాగార్జురెడ్డి, బాంబు డిస్సోజల్ స్క్వాడ్ అధికారి బీరయ్య, ఇతర సిబ్బంది కలసి ఇస్కాన్ ఆలయానికి చేరుకుని శనివారం తెల్లవారుజాము వరకు అక్కడున్న అతిథి గృహంతోపాటు ఆలయ పరిసరాలు, భక్తులు వేచి ఉండే గదులు, అన్నప్రసాదం క్యాంటీన్, గోశాల, భజనమందిరం, ఇతర ప్రాంతాల్లో నిశితంగా తనిఖీ చేశారు. తిరుపతి, తిరుమలలో భక్తులు తిరిగే అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. బాంబుల జాడ కనిపించకపోవడంతో అవి ఫేక్ మెయిల్స్‌గా నిర్థారించారు.