మళ్లీ హోటళ్లకు బాంబు బెదిరింపు
ABN , Publish Date - Dec 02 , 2025 | 02:02 AM
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కపిలతీర్థం వద్దనున్న పాయ్ వైశ్రాయ్, రాజ్ పార్కు హోటళ్ల వద్ద ఐఈడీ బాంబులు పెట్టామని, ఏ క్షణమైనా పేలతాయంటూ పాక్ ఐఎ్‌సఐ పేరిట సోమవారం మెయిల్స్ వచ్చాయి.
ఫేక్ మెయిల్స్‌గా తేల్చిన పోలీసులు
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కపిలతీర్థం వద్దనున్న పాయ్ వైశ్రాయ్, రాజ్ పార్కు హోటళ్ల వద్ద ఐఈడీ బాంబులు పెట్టామని, ఏ క్షణమైనా పేలతాయంటూ పాక్ ఐఎ్‌సఐ పేరిట సోమవారం మెయిల్స్ వచ్చాయి. ఎస్పీ సుబ్బరాయడు ఆదేశాలతో డీఎస్పీ భక్తవత్సలం, సీఐ రాంకిషోర్, ఎస్‌ఐలు అజిత, నాగార్జున రెడ్డి, బాంబు స్క్వాడ్ ఎస్‌ఐ పీరయ్య, సిబ్బంది మెటల్ డిటెక్టర్లు, బాంబు నిర్వీర్యం పరికరాలతో రెండు హోటళ్లలో నిశితంగా తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు తనిఖీలు చేశాక.. ఎలాంటి పేలుడు పదార్థాలు, ఐఈడీ బాంబులు లేవని నిర్ధారణకు వచ్చారు. కాగా, ఏడాదిగా తిరుపతిలోని పలు హోటళ్లు, వివిధ రకాల సంస్థలు, ఇస్కాన్ మందిరానికి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.