తరలిపోతున్న నల్ల బంగారం!
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:39 AM
పెద్దిశెట్టిపల్లెలో గ్రానైట్ అక్రమ తవ్వకాలు వ్యవహారం నడిపిస్తున్న గుడిపాల మండలానికి చెందిన చోటా నేత కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి

చిత్తూరు రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు రూరల్ మండలంలోని పెద్దిశెట్టిపల్లెలో గ్రానైట్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడున్న ఓ గుట్టలో అరుదుగా లభించే జీ-20 (నల్ల రాయి) ఉండటమే దీనికి కారణం. ఈరాయి క్యూబిక్ మీటరు ధర రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతుంది. అందువల్లే ఈ రాయికి నల్లబంగారం అనే పేరొచ్చింది. ఈ రాయికి మన రాష్ట్రంతోపాటు తమిళనాడులోనూ డిమాండ్ ఉంది. దీన్ని గుర్తించిన గుడిపాల మండలానికి చెందిన ఓ చోటా నేత అక్రమ దందాకు తెరలేపాడని స్థానికులు చెబుతున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా గుట్టను కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
పెద్దిశెట్టిపల్లె గ్రామ అటవీప్రాంతంలోని కొండను పేల్చడానికి భారీ బాంబులు వాడుతున్నారు. దీనివల్ల అధిక శబ్దాలు రావడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందడంతో కొన్ని రోజులు తవ్వకాలు ఆపి, మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. నల్లరాయిని అక్రమంగా తరలించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికీ కోట్లలో గండి పడుతోంది.
రెండు షిప్టులుగా తవ్వకాలు
రాత్రీపగలు తేడా లేకుండా రెండు షిప్టులుగా తవ్వకాలు జరుపుతున్నారు. రోజుకు 10 లారీలతో రవాణా చేస్తున్నారు. రాత్రయితే పెద్దపెద్ద శబ్దాలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కొత్తగా వేసిన తారురోడ్డు పూర్తిగా పాడవుతోందని స్థానిక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
రెండు నెలలుగా అక్రమ తవ్వకాలు జరుగుతుంటే రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు కొన్ని రోజులు ఆగి పనులు చేసుకోండని ఓ అధికారి సలహా ఇచ్చాడని కూడా సమాచారం.
తరలించేదిలా..
పెద్దిశెట్టిపల్లె గ్రామం నుంచి కూతవేటు దూరంలోనే గుడిపాల మండల ఉంటుంది. దీనికి పక్కనే తమిళనాడు సరిహద్దు ఉంది. దాంతో గుడిపాల మండలం మీదుగా నల్లబంగారాన్ని తమిళనాడుకు యథేచ్ఛగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. అలాగే గుడిపాల మండల పరిసర గ్రానైట్ ఫ్యాక్టరీలకూ నల్లరాయిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇకనైనా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామస్తులు కోరుతున్నారు.