బిరబిరా.. కృష్ణమ్మ కదలి వచ్చేను!
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:53 AM
కుప్పంకి చేరుకోవడానికి కృష్ణా జలాలు ఉరకలెత్తుతున్నాయి. బహుశా ఆదివారం రాత్రికి కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువుకు చేరవచ్చని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.
కుప్పం అన్నదాతలో ముందస్తు జలకళ!
నేటి రాత్రికి పరమసముద్రం చెరువుకు చేరనున్న హంద్రీ-నీవా జలాలు
30న సీఎం చంద్రబాబు జలహారతి
తీరనున్న సాగు, తాగునీటి బెంగ
కుప్పం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కుప్పంకి చేరుకోవడానికి కృష్ణా జలాలు ఉరకలెత్తుతున్నాయి. బహుశా ఆదివారం రాత్రికి కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువుకు చేరవచ్చని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 30న ఈ చెరువు వద్ద హంద్రీ-నీవా కాలువకు జలహారతి ఇవ్వనున్నారు. కుప్పం అన్నదాతలో ముందస్తు జకలకళ కనిపిస్తోంది. హంద్రీ-నీవా జలాలతో తాగునీటి ఇబ్బంది కూడా తీరనుంది. నంద్యాల జిల్లా మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద జూలై 17న ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జలాలను హంద్రీ-నీవా కాలువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవి అన్నమయ్య జిల్లా మదనపల్లె దాటుకుని ఈనెల 22వ తేదీనాటికి పుంగనూరు చేరుకున్నాయి. శనివారం నాటికి పలమనేరు నియోకవర్గం వి.కోట మండల పరిధిలోకి వచ్చేశాయి. ప్రస్తుతం కాల్వలో 80 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇదే వేగంతో సాగితే ఆదివారం రాత్రికల్లా కుప్పం మండలంలోకి వస్తాయి.
సాగులోకి 6,300 ఎకరాలు
కుప్పం బ్రాంచి కెనాల పొడవు 123.641 కిలోమీటర్లు. మధ్యలో 330 నిర్మాణాలు ఉన్నాయి. మూడు పంప్ హౌస్‌ల ద్వారా నీటిని పంప్ చేస్తున్నారు. కాలువ పొడవునా 5.350 కిలోమీటర్లు, 39.225 కిలోమీటర్లు, 60.715 కిలోమీటర్ల దూరాలలో ఈ పంప్ హౌస్‌లను నిర్మించారు. హంద్రీ-నీవా కుప్పం బ్రాంచి కాలువ నిర్మాణానికి రూ.593.43 కోట్ల వ్యయం చేశారు. ఈ కాలువ ద్వారా పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన 8 మండలాల పరిధిలోని 110 చెరువుల కింద 6,300 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. అంతేకాక 4.02 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది.
పరమసముద్రం వద్ద పైలాన్
సొంత నియోజకవర్గ ప్రజల కలలు సాకారమవుతున్న నేపథ్యంలో ఈనెల 29, 30 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. పరమసముద్రం చెరువు సమీపంలో హంద్రీ-నీవా కాలువకు జలహారతి ఇచ్చి, సమీపంలోనే బహిరంగ సభలో పాల్గొని నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొక్లెయినర్లతో చెరువుకట్ట కింద ఉన్న పొదలను తొలగిస్తున్నారు. కట్టను బలోపేతం చేస్తున్నారు. ఉన్న రెండు కలుజులను సైతం మరమ్మతులు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భానికి గుర్తుగా చెరువు సమీపంలో కాలువ గట్టుపై పైలాన్‌ను సీఎం ఆవిష్కరించన్నారు. ఇక్కడ సుమారు 18 అడుగుల ఎత్తుగల పైలాన్ నిర్మాణం చకచకా సాగుతోంది. మరోవైపు సభావేదిక కోసం భూమిని చదును చేసే పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి.
అన్నదాతలో జలకళ
పరమసముద్రం చెరువు విస్తీర్ణం 110 ఎకరాలు. ఇందులో దాదాపు 20-26 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. అయితే కృష్ణా జలాలతో ఒకసారి చెరువు నిండితే ఈ ఆక్రమణలు వాటికవే తొలగిపోయే అవకాశం ఉంది. పరమసముద్రం చెరువు నిండితే దీనికున్న రెండు కలుజుల ద్వారా ప్రవాహం కిందివైపున గల కుప్పం సమీపంలోని వీరప్పనాయని చెరువు, అక్కడినుంచి మండలంలోని దిగువ చెరువులకు చేరుతాయి. ముందుగా నీటిని పరమసముద్రం చెరువుకు చేర్చి, తర్వాతనే నియోజకవర్గంలోని మిగిలిన చెరువులకు విడుదల చేయనున్నారు. కేవలం పరమసముద్రం చెరువు కిందనే దాదాపు 800 ఎకరాల ఆయకట్టు ఉంది. అంతేకాదు.. నియోజకవర్గం పొడవునా ప్రవహించే కాలువ ద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి, ఆమేరకు ఎండిపోయిన బోరుబావులు రీచార్జి అవుతాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో భూగర్భ జలాలు 700-1200 అడుగుల లోతులో ఉన్నాయి. అందువల్ల వందల బోర్లు నిరుపయోగం మారాయి. కృష్ణా జలాల వల్ల వీటిలో ముప్పావు వంతు తిరిగి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో కుప్పం అన్నదాతలో ఎన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. పరమసముద్రం చెరువు వద్ద తిరుగాడుతున్న కొంతమంది రైతులని పలుకరిస్తే బంగారు భవిష్యత్తు సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.
చెరువు నిండితే పట్టిందల్లా బంగారమే
ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యాన చెరువు నిండబోతోంది. ఇక మా ఊరోళ్లకే కాదు, పక్క ఊళ్ల వాళ్లకూ పట్టిందల్లా బంగారమే. మట్టినుంచి మాణిక్యాలు పండించుకోవచ్చు. ఈ చెరువు కింద మావూరు, పక్కవూళ్లు కలిసి సుమారుగా 1000 ఎకరాలుండాయి. ఈ భూముల్లో ఏ పంట ఏసినా బంగారంలా పండుతుంది.
- ఎం.చిన్నబ్బయ్య, మాజీ సర్పంచి, పరమసముద్రం
ఇంక దిగులే లేదు
నేను ఏడు ఎకరాల్లో వరి ఏశాను. బోర్లలో నీళ్లు తక్కవ కావడంతో అంతంతమాత్రం పంట వస్తోంది. హంద్రీ-నీవా కాలువలో నీళ్లు వచ్చి, మా చెరువు నింపతారంట. అదే జరిగితే బోర్లలో నీళ్లు పైకొస్తాయి. ఇంక దిగులే లేదు.
- శ్రీనివాసులు, రైతు, పరమసముద్రం