Share News

ప్రాజెక్టుల పేరుతో పాతిక కోట్లు ప్రజాధనం వృధా

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:28 AM

వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో రూ.25 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు.శాసనసభలో జలవనరుల అంశంపై శుక్రవారం మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పులను చర్చించారు.

ప్రాజెక్టుల పేరుతో పాతిక కోట్లు ప్రజాధనం వృధా

వైసీపీ ప్రభుత్వ తీరును అసెంబ్లీలో దుయ్యబట్టిన సీఎం

పుంగనూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో రూ.25 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు.శాసనసభలో జలవనరుల అంశంపై శుక్రవారం మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పులను చర్చించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణ విషయాల్లో కాంట్రాక్టర్లు చేసిన తప్పులకు అపరాధంగా వైసీపీ ప్రభుత్వం రూ.25 కోట్లు జరిమానా చెల్లించిందని గుర్తు చేశారు.పుంగనూరు మండలంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో నేతిగుట్లపల్లె రిజర్వాయర్‌ , సోమల మండలంలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో ఆవులపల్లె రిజర్వాయర్‌, కురబలకోట మండలంలో 2 టీఎంసీల సామర్ధ్యంతో ముదివేడు రిజర్వాయర్‌ నిర్మాణాల కోసం రూ.2,144 కోట్లతో గత ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. టెండర్లు వారి మనుషులకే ఇచ్చేలా చేయడానికి సంబంధిత మంత్రి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని కూడా గుర్తుచేశారు. రిజర్వాయర్లను నిబంధనలకు విరుద్ధంగా తమకు అన్యాయం జరిగేలా నిర్మిస్తున్నట్లు నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)ని ,రైతులు ఆశ్రయించారన్నారు. దీంతో రిజర్వాయర్ల నిర్మాణంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.100 కోట్లు జరిమానా కృష్ణాబోర్డుకు చెల్లించాలని సంచలన తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. కాంట్రాక్టరు చేసిన తప్పులకు ప్రభుత్వమే రూ.25 కోట్లు జరిమానా చెల్లించిందని మండిపడ్డారు. హంద్రీనీవా సుజలస్రవంతి ఫేజ్‌-2లో కేవీపల్లె మండలంలోని అడవిపల్లె నుంచి చిత్తూరు నీవా బ్రాంచ్‌ కెనాల్‌కు రూ.1417.81 కోట్లతో నీటిని తీసుకెళ్లడం ద్వారా రూ.1.75లక్షల ఎకరాలకు సాగునీరు, పలుప్రాంతాలకు తాగునీరు ఇస్తామన్నారు. అలాగే లింక్‌ కెనాల్‌ నుంచి కళ్యాణ్‌డ్యాంకు నీటిని తీసుకెళతామన్నారు.తనకు 8సార్లు ఓట్లు వేసి గెలిపించిన కుప్పం ప్రజలకు హంద్రీనీవా కాలువల ద్వారా కృష్ణాజలాలను అందించడంతో ఎంతో తృప్తిగా అన్పించిందని సంతోషం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం విధ్వంసం, స్వలాభం కోసం పనిచేసి చెడ్డపేరు తెచ్చుకుందని ఆరోపించారు. తాము ప్రాధాన్యత క్రమంలో పెట్టుకున్న లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తామని, అన్ని జలాశయాలు, చెరువులు నీటితో నింపడం జరుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 01:28 AM