నేటినుంచి భువనేశ్వరి కుప్పం పర్యటన
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:27 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి బుధవారంనుంచి నాలుగురోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. నాలుగు మండలాల పరిధిలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొని వారి సాదకబాధకాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
4రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం సతీమణి
కుప్పం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి బుధవారంనుంచి నాలుగురోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. నాలుగు మండలాల పరిధిలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొని వారి సాదకబాధకాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. అలాగే కుప్పం తరలివచ్చిన కృష్ణా జలాలకు జలహారతి ఇస్తారు. మహిళా నాయకురాళ్లతో, ఆర్టీసీ ఉచిత ప్రయాణ లబ్ధిదారులైన మహిళలతో సైతం సమావేశమవుతారు. చివరి రోజు ఆఖరు కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్టు కార్యకలాపాల్లో పాల్గొంటారు.
నేటి పర్యటన ఇలా...
ద్రావిడ విశ్వవిద్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థులతో ముఖాముఖిలో భువనేశ్వరి పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అలీప్ ప్రాజెక్టు ద్వారా శిక్షణ పొందిన మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.సాయంత్రం 6 గంటలకు గుడుపల్లె మండలం మల్లప్పకొండకు వెళ్లి మల్లేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారు. రాత్రి శాంతిపురం మండలం కడపల్లె వద్ద గల స్వగృహంలో బస చేస్తారు.
రేపటి పర్యటన ఇలా...
గురువారం ఉదయం 9 గంటలకు స్వగృహంలో ప్రజలనుంచి వినతులు స్వీకరిస్తారు. 10.30 గంటలకు కుప్పం పురపాలక సంఘ పరిధిలోని దళవాయికొత్తపల్లె చెరువుకు చేరుకుని కృష్ణా జలాలకు హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.15 గంటలదాకా మున్సిపాలిటీ పరిధిలోని పరసముద్రం కేజీబీవీ స్కూల్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని మధ్యాహ్నం వారితో కలిసి భోంచేస్తారు.మధ్యాహ్నం 2.30 గంటలకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పూలమార్కెట్టు సమీపంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు.3.45 గంటలకు సామగుట్టపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘విలువల బడి’ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలనుంచి 5 గంటలదాకా కడపల్లె వద్ద గల స్వగృహంలో మహిళా నాయకురాళ్లతో సమావేశమవుతారు. సాయత్రం 5 గంటలకు డీఎస్సీలో ఎంపికై కొత్తగా ఉద్యోగాలు పొందిన టీచర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు.