Share News

దళితుడని చిన్నచూపా..!

ABN , Publish Date - Nov 30 , 2025 | 01:15 AM

‘నేను దళితుడిని కాబట్టి నన్ను చిన్నచూపు చూస్తున్నారు.. అధికారులు ప్రోటోకాల్‌ పాటించనప్పుడు నాకు ఈ ఎస్కార్టు ఎందుకు..’ అంటూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆక్రోశం వ్యక్తం చేశారు.

దళితుడని చిన్నచూపా..!
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం

- ప్రోటోకాల్‌ పాటించడం లేదు..మీ ఎస్కార్టు నాకు అవసరం లేదు

- డీవీఎంసీ సమావేశంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆక్రోశం

తిరుపతి(కలెక్టరేట్‌), నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘నేను దళితుడిని కాబట్టి నన్ను చిన్నచూపు చూస్తున్నారు.. అధికారులు ప్రోటోకాల్‌ పాటించనప్పుడు నాకు ఈ ఎస్కార్టు ఎందుకు..’ అంటూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆక్రోశం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ వేదికగా శనివారం జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీఎన్‌కండ్రిగ మండలం కాంపాళెంలో దళిత కుటుంబంపై దాడి చేయడమేగాక వారిపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను సురుటుపల్లి ఆలయ బోర్డులో ఎలా నియమిస్తారని నిలదీశారు. అక్కడ ఒక దళితుడైనా ప్రాతినిథ్యం వహించారా అని ప్రశ్నించారు. సత్యవేడు స్పెషలాఫీసర్‌గా ఉన్న వ్యక్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ శంకర్‌రెడ్డికి ఉన్న విలువ తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు నివేదిక అందజేశారు.

అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించండి

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎప్పటికపుడు పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. డీవీఎంసీలో ప్రస్తావించే ప్రతి అంశానికీ పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు, ఇళ్ల పట్టాలు వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో నరసింహులు, ఏఎస్పీ రవిమనోహరాచారి, ఆర్డీవోలు రామ్మోహన్‌, భానుప్రకాష్‌రెడ్డి, కిరణ్మయి, ఇతర అధికారులు విక్రమ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 01:16 AM