Share News

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:21 AM

మొంథా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని, ఆ సమయంలో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం ఆయన టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల యంత్రాంగానికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని, ఆ సమయంలో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం ఆయన టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల యంత్రాంగానికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాకు ఆరెంజ్‌ అలెర్టు ప్రకటించిన నేపఽథ్యలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌తోపాటు జిల్లా ముఖ్య అధికారులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ విద్యుత్‌, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం రాకుండా చూసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చేలా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ వారికి ఆహారం, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య బృందాలను నియమించాలని సూచించారు. రోడ్లు, చెరువులు, కాలువల గండ్లు, కోతకు గురైన రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన పవర్‌ క్రేన్లు, జేసీబీలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

జిల్లా ప్రత్యేకాధికారిగా గిరీషా

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను కారణంగా జిల్లాలో సహాయక చర్యలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించేందుకు పీఎస్‌ గిరిషాను జిల్లా ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. తుఫాను కారణంగా చోటు చేసుకునే పరిణామాలు, జిల్లా యంత్రాంగం తీసుకునే చర్యలు, శిబిరాల ఏర్పాటు, చెరువులు, డ్యాంల వద్ద భద్రత, ప్రమాదాలు, పశు, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ప్రత్యేక వైద్య బృందాలు, వైద్య శిబిరాలు, ఎన్‌డీఆర్‌ఎ్‌ప, రెస్క్యూ టీంలు, కోతకు గురైన రోడ్లు, వాటి మరమ్మతులు, సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలు, ఏర్పాట్లు తదితరాలు పరిశీలించనున్నారు.

పలమనేరులో 69 మి.మీ వర్షపాతం

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా పలమనేరులో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా పుంగనూరులో ఒక మి.మీ నమోదైంది. ఇక పెనుమూరులో 55, పూతలపట్టు 50, సదుం 44.8, చౌడేపల్లి 41.4, చిత్తూరు అర్బన్‌ 40.8, జీడీ నెల్లూరు 39.2, గంగవరం 37.6, సోమల 35.4, తవణంపల్లె 27.4, గుడిపాల 25, ఎస్‌ఆర్‌పురం 22.6, ఐరాల 19, యాదమరి 17, పాలసముద్రం 14.2, చిత్తూరు రూరల్‌ 13.4, బంగారుపాళ్యం 6, పెద్దపంజాణి 4, బైరెడ్డిపల్లె 2.6, రామకుప్పం, రొంపిచెర్ల 2.2, కార్వేటినగరం, పులిచెర్లలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

Updated Date - Oct 27 , 2025 | 02:21 AM