‘బార్’ కొత్త పాలసీలోని నిబంధనతో వెనకడుగు
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:31 AM
తిరుపతి జిల్లాలో బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు మద్యం వ్యాపారులు ముందుకు రావడంలేదు. నాలుగు దరఖాస్తులు చేసుకుంటేనే లాటరీ తీస్తామన్న నిబంధనతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అంటారు. దీంతో బార్లకు దరఖాస్తు చేయాలంటూ గతంలో మద్యం షాపులకు దరఖాస్తు చేసిన వారందరికీ ఎక్సైజ్ అధికారులు మెసేజ్‌లు పంపినట్లు సమాచారం.
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు మద్యం వ్యాపారులు ముందుకు రావడంలేదు. నాలుగు దరఖాస్తులు చేసుకుంటేనే లాటరీ తీస్తామన్న నిబంధనతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అంటారు. దీంతో బార్లకు దరఖాస్తు చేయాలంటూ గతంలో మద్యం షాపులకు దరఖాస్తు చేసిన వారందరికీ ఎక్సైజ్ అధికారులు మెసేజ్‌లు పంపినట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 29 బార్లకు ఓపన్ కేటగిరి కింద నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుకు మంగళవారం గడువుగా ప్రకటించింది. ఇప్పటి వరకు తిరుపతి డివిజన్ పరిధిలోని 22 బార్లకు 9 ఆఫ్‌లైన్, మూడు ఆన్‌లైన్ ద్వారా మొత్తం 12 దరఖాస్తులు వచ్చాయి. గూడూరు డివిజన్ పరిధిలో 7 బార్లకు ఒక దరఖాస్తు కూడా రాలేదు. బార్ల కోసం లాటరీలో పాల్గొనాలంటే మొదట ఉచితంగా ఎన్‌రోల్‌మెంటు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాససింగ్ ఫీజు కింద రూ 10,000 చెల్లించాలి. అనంతరం రూ.5 లక్షలు దరఖాస్తు ఫీజు చెల్లించిన లాటరీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ, ప్రతి బార్‌కు నాలుగు దరఖాస్తులు సమర్పించాలనే నిబంధన ఉంచారు. నాట్ రీఫండబుల్ కావడంతో.. నాలుగు దరఖాస్తులకు రూ.20.4 లక్షలు వెచ్చించడానికి వ్యాపారులు సుముఖత చూపడంలేదు. మరోవైపు మద్యం దుకాణాలకు పర్మిట్ రూములు ఇవ్వడంతోనూ వెనకడుగు వేస్తున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈ నెల 29 వరకు పొడిగించింది. జిల్లాలో ఓపన్ కేటగిరీ కింద 29 బార్లు, రిజర్వేషన్ కింద గీత కార్మికులకు మరో మూడు బార్లు కేటాయించినట్లు ఈఎస్ నాగమల్లేశ్వర రెడ్డి చెప్పారు. దరఖాస్తుకు చివరి తేదిగా ఓపన్ కేటగిరి కింద 29వ తేది సాయంత్రం 6 గంటల వరకు, రిజర్వేషన్ కేటగిరీల కింద అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు గడువు విధించారన్నారు. 30న లాటరీ ద్వారా బార్లు కేటాయించడానికి ఓపన్ కేటగిరీకి ఉదయం 8 గంటలకు, రిజర్వేషన్ కేటగిరీ కింద ఉదయం 10 గంటలకు ప్రాసస్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమవుతుందన్నారు.