బాలునాయక్ ఆస్తులు భారీనే!
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:44 AM
కర్నూలు కార్మికశాఖ జాయింట్ కమిషనరు బాలు నాయక్ ఆస్తులు భారీగానే ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించి శనివారం ఆయన్ను అరెస్టు చేశారు.
రెండు రోజులపాటు ఏసీబీ సోదాలు
కార్మిక శాఖ జాయింట్ కమిషనరు అరెస్టు
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): కర్నూలు కార్మికశాఖ జాయింట్ కమిషనరు బాలు నాయక్ ఆస్తులు భారీగానే ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించి శనివారం ఆయన్ను అరెస్టు చేశారు. బాలు నాయక్‌పై కొంతకాలంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో శుక్ర, శనివారాల్లో తిరుపతి ప్రాంతీయ అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ విమలకుమారి నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. కర్నూలులోని కార్మిక శాఖ కార్యాలయంతో పాటు అద్దె ఇల్లు, తిరుపతిలో రెండు చోట్ల, అన్నమయ్య జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో.. ఇలా మూడు జిల్లాల పరిధిలో 11 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిగాయి. తిరుపతినగరం రాఘవేంద్ర నగర్‌లో దాదాపు మూడు అంతస్తుల ఇల్లు, కుమారుడి పేరిట సర్జికల్ దుకాణం ఉంది. రేణిగుంట మండలం గాజులమండ్యంలో ఇంటి ప్లాటు ఉన్నట్లు రికార్డుల ద్వారా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక కర్నూలులో భార్య పేరు మీద ప్లాటు, వ్యవసాయ భూములు ఉన్నాయని గుర్తించినట్ల తెలిసింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లిలో బాలు నాయక్ కుటుంబ సభ్యుల పేర్లమీద 10 ఎకరాల పొలాలు ఉన్నట్లు తనిఖీల్లో వెలుగు చూసినట్లు సమాచారం. సంబేపల్లిలో ఒక పౌల్ర్టీ ఫారం ఉంది. తిరుపతిలో ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ డాక్యుమెంట్ విలువ ప్రకారం రూ.ఐదారు కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.50 కోట్లు ఉండొచ్చని అంచనా. వీటితో పాటు పలు చోట్ల బినామీ పేర్ల మీద ఆస్తులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక, అర కిలో బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు లాకర్లను పరిశీలించేందుకు మేనేజర్లకు లేఖలు రాశారు. శనివారం బాలు నాయక్‌ను అరెస్టు చేసి నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు తరలించారు.