Share News

బాహుబలి 9వ విజయం

ABN , Publish Date - Dec 25 , 2025 | 01:24 AM

ఇస్రో విజయాశ్వంగా పేరుపడిన పీఎ్‌సఎల్వీ రాకెట్‌ సరసన ఇప్పుడు ఎల్వీఎం3 చేరింది. బుధవారం షార్‌ నుంచి అత్యంత బరువైన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా చేర్చిన ఈ బాహుబలి రాకెట్‌ తన రికార్డులను తనే అధిగమిస్తోంది.

బాహుబలి 9వ విజయం
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి దూసుకెళుతున్న ఎల్వీఎం 3 రాకెట్‌

15.30 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలోకి బ్లూబర్డ్‌ ఉపగ్రహం

ఎల్వీఎం3 ప్రయోగాల్లో వందశాతం విజయం నమోదు

ఇస్రో శాస్త్రవేత్తల్లో పెల్లుబికిన ఆనందం

సూళ్లూరుపేట, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇస్రో విజయాశ్వంగా పేరుపడిన పీఎ్‌సఎల్వీ రాకెట్‌ సరసన ఇప్పుడు ఎల్వీఎం3 చేరింది. బుధవారం షార్‌ నుంచి అత్యంత బరువైన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా చేర్చిన ఈ బాహుబలి రాకెట్‌ తన రికార్డులను తనే అధిగమిస్తోంది. ఎల్వీఎం ట్రాక్‌ రికార్డుతో ఇస్రో ప్రతిష్ట ప్రపంచంలో మరింత పెరిగింది. బుధవారంనాటి బ్లూబార్డ్‌ బ్లాక్‌ 2 ఉపగ్రహం ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. మంగళవారం ఉదయం 8.54 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ 0కు చేరుకోగానే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్‌ బుధవారం ఉదయం 8:55 గంటలకు నిప్పులు చిమ్మూతూ భారీ విదేశీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. శాస్త్రవేత్తల కలలను సాకారం చేస్తూ... వారి శ్రమకు ప్రతిఫలమిస్తూ బ్లూబర్డ్‌ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. దీంతో ఒక్కసారిగా మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌తో పాటు షార్‌లో సంబరాలు చేసుకున్నారు. అమెరికాకు చెందిన అత్యంత బరువైన 6,100 కిలోల బరువు కలిగిన సమాచార ఉపగ్రహం బ్లూబర్డ్‌ బ్లాక్‌ 2 కక్ష్యలోకి ప్రవేశించడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషంతో ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈప్రయోగం వాణిజ్య పరంగా తిరుగులేని శక్తిగా ఇస్రో ఆవిర్భివించేందుకు మార్గం సుగమం చేసింది. భవిష్యత్‌లో భారీ ప్రయోగాలకు నాంది పలకడంతో పాటు, ఆదాయ వనరుగా అవతరించనుంది. ఎల్వీఎం3 రాకెట్‌ శాస్త్రవేత్తల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేపట్టిన అన్ని ప్రయోగాలూ విజయాన్ని అందించడం విశేషం. వరుసగా ఇది తొమ్మిదో విజయం. కాగా ప్రయోగాన్ని వీక్షించేందుకు మంచును సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి విజిటర్స్‌ గ్యాలరీకి సందర్శకులు, విద్యార్థులు భారీగా చేరుకున్నారు. రాకెట్‌ భూమి నుంచి నింగిలోకి ఎగరగానే గ్యాలరీలో ఉన్న వీక్షకులు చప్పట్లు, కేరింతలు కొడుతూ ఉత్సాహంతో బాహుబలికి వీడ్కోలు పలికారు.

Updated Date - Dec 25 , 2025 | 01:24 AM