బ్లూబర్డ్‌తో బాహుబలి రెడీ
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:50 AM
షార్ నుంచి నేడు 104వ రాకెట్ ప్రయోగం తొమ్మిదో విజయం నమోదు చేసుకోనున్న ఎల్వీఎం3 నేడు కక్ష్యలోకి భారీ అమెరికా ఉపగ్రహం
సూళ్లూరుపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బాహుబలి ఖాతాలో మరొక రికార్డు విజయాన్ని నమోదు చేసుకోవడానికి శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం సిద్ధమైంది. బుధవారం ఉదయం 8.54 గంటలకు షార్ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలతోపాటూ, విదేశీ శాస్త్రవేత్తలూ శ్రీహరికోటలో ఉన్నారు. కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. ఎల్వీఎం3-ఎం6 రాకెట్ అత్యంత బరువైన అమెరికన్‌కు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని రోదసీలోకి చేర్చనుంది. మన భూభాగం నుంచి ప్రయోగిస్తున్న అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు షార్ నుంచి ఏఎ్‌సఎల్వీ, ఎస్‌ఎల్వీవీ, పీఎ్‌సఎల్వీ, జీఎ్‌సఎల్వీ, జీఎ్‌సఎల్వీ-మార్క్3, ఎస్‌ఎ్‌సఎల్వీ, ఆర్‌ఎల్వీ-టీడి, క్రామ్‌జెట్ సహా మొత్తం 103 ప్రయోగాలు చేపట్టారు. బుధవారం షార్ నుంచి ప్రయోగించే ఎల్వీఎం3-ఎం6 రాకెట్ 104వ ప్రయోగం కాగా ఈ ఏడాదిలో ఇది 5వ ప్రయోగం కావడం విశేషం. ఎల్వీఎం3 ప్రయోగాల్లో ఇది తొమ్మిదవది. ఇప్పటిదాకా ప్రయోగించిన ఎల్వీఎం3 ప్రయోగాలు అన్నీ విజయవంతమయ్యాయి. పీఎ్‌సఎల్వీ రాకెట్లను నాలుగు దశల్లో ప్రయోగిస్తే ఎల్వీఎం3 రాకెట్లను మూడు దశల్లో ప్రయోగిస్తారు. ఈ నేపథ్యంలోనే నేటి ప్రయోగ విజయం పట్ల శాస్త్రవేత్తలు ధీమాతో ఉన్నారు. పైగా ఇది ఇస్రోకి కాసులు కురిపించే మరో వాణిజ్య ప్రయోగం కూడా.
ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ఎత్తు: 43.5 మీటర్లు
మొత్తం బరువు: 640 టన్నులు
బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం బరువు: 6,400 కిలోలు
ప్రయోజనం: మెరుగైన మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు
ప్రయోగం: ఉదయం 8.54 గంటలకు
భారీ బందోబస్తు
ప్రయోగ నేపథ్యంలో షార్ భారీ బందోబస్తు పెంచారు. శ్రీహరికోటకు వెళ్లే ప్రధాన మొదటి గేటు వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్నారు. అదే విధంగా షార్ పరిసరాలోనూ, అటవీ ప్రాంతంలో నూ జల్లెడపట్టి గాలిస్తున్నారు. జలమార్గంలో మెరైన్, కోస్టల్ గార్డ్స్‌చే నిఘా పెంచారు.
మొదటి దశ: స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. ఇది 105.98 సెకన్లపాటు మండుతూ మొత్తం రాకెట్‌ను నింగిలోకి తీసుకువెళ్తుంది.
రెండో దశ: 110 టన్నుల ధ్రవ ఇంధనం ఉంటుంది. మొదటి దశ పూర్తికాగానే ఈ దశలోని ఇంధనం 301.70 సెకన్ల పాటు మండుతూ మరింత పైకి రాకెట్‌ను తీసుకువెళ్తుంది.
మూడో దశ: ఇది కీలకమైన క్రయోజనిక్ దశ. 304.36 సెకన్లకు ప్రారంభమై 949.03 సెకన్ల దాకా మండుతుంది. నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్ శిఖరబాగాన్ని చేరుస్తుంది.
అంతిమ లక్ష్యం: 942.52 సెకన్లకు రాకెట్ శిఖర భాగాన ఉన్న బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేరవేస్తుంది.