ఆనందంలో ఆటోవాలా!
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:25 AM
జిల్లాలో ‘ఆటో మిత్ర’ పథకంద్వారా సుమారు 6600మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది.గత నెల 15న ‘స్త్రీ శక్తి’ పథకం పేరిట మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిన విషయం విధితమే.
వాహన మిత్ర’ ద్వారా 6600 మందికి లబ్ధి
17 నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
చిత్తూరు సిటీ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘ఆటో మిత్ర’ పథకంద్వారా సుమారు 6600మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది.గత నెల 15న ‘స్త్రీ శక్తి’ పథకం పేరిట మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిన విషయం విధితమే. ఈ పథకం వల్ల తమకు ఆదాయం తగ్గుతుందని ఆటో డ్రైవర్లు డీలాపడ్డారు. వారిని కూడా ఆదుకుంటామని అప్పట్లో సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే వారికి రూ.15 వేల వంతున దసరా కానుకగా అందిస్తామని ఇటీవల ప్రకటించారు. జిల్లాలో రూ.15 వేల వంతున 6600 మందికి రూ.99 లక్షల లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఆటో, మ్యాక్సీక్యాబ్ యజమానులకు, డ్రైవర్‌గా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఇదివరకే ఉన్న లబ్ధిదారుల జాబితాను పరిగణించడంతో పాటు కొత్త దరఖాస్తులకు ఈ నెల 17 నుంచి 19వతేది వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించవచ్చు. 22వ తేదిలోపు క్షేత్ర పరిశీలన పూర్తిచేసి 24న తుది జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు డబ్బులు జమ చేయడం ప్రారంభిస్తారు.
ఫ అర్హతలివే
ఆటో, మాక్సీక్యాబ్ యజమానే డ్రైవర్‌గా ఉండాలి. ఆధార్, తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఆదాయపు పన్ను చెల్లించేవారున్నా, నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటినా, పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా పథకానికి అర్హులు కారు.