ఆనందంలో ఆటోవాలా
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:18 AM
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు.జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి అర్హులైన 6777మంది ఆటో డ్రైవర్లకు రూ.10.16 కోట్లు ఆర్థిక సాయం అందజేశారు.
జిల్లాలో 6777మందికి రూ. 10.16 కోట్ల లబ్ధి
నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా సమావేశాలు
పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు,కూటమి నేతలు
చిత్తూరు అర్బన్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి):ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు.జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి అర్హులైన 6777మంది ఆటో డ్రైవర్లకు రూ.10.16 కోట్లు ఆర్థిక సాయం అందజేశారు.నియోజకవర్గాల వారీగా పూతలపట్టులో ఎమ్మెల్యే మురళీమోహన్, జీడీనెల్లూరులో ప్రభుత్వ విప్ థామస్, పుంగనూరులో శాప్ ఛైర్మన్ రవి నాయుడు పాల్గొని ఆటో డ్రైవర్లకు నమూనా చెక్‌లు పంపిణీ చేశారు. పలమనేరులో నిర్వహించిన ఆటో డ్రైవర్ల ర్యాలీలో డీసీసీబీ ఛైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి పాల్గొనగా, కుప్పంలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని నమూనా చెక్‌లు అందజేశారు.చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్మోహన్, కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆటో డ్రైవర్లకు నమూనా చెక్ అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న పనులను అందరూ అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.ఎమ్మెల్యే జగన్మోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ అర్హులైన వారు లబ్ధిదారుల జాబితాలో లేకుంటే సమస్యను పరిష్కరించి అర్హుల జాబితాలో చేరుస్తామన్నారు.ఆటో డ్రైవర్లకు తక్కువ వడ్డీతో రుణాలివ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు వందలాది ఆటోలతో గాంధీ విగ్రహం నుంచి ఎంఎస్‌ఆర్ మీదుగా నాగయ్య కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. మేయర్ అముద, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీఆర్ రాజన్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ సీఎంటీ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.