Share News

రెవెన్యూ రికార్డుల తారుమారు యత్నం

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:09 AM

పలమనేరు నియోజకవర్గ తహసీల్దార్లపై కలెక్టర్‌ ఆగ్రహం

 రెవెన్యూ రికార్డుల తారుమారు యత్నం

చిత్తూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పలమనేరు నియోజకవర్గంలోని కొందరు తహసీల్దార్ల మీద కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహించినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో తహసీల్దార్లు ప్రభుత్వ భూముల రికార్డుల్ని పట్టా భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టర్‌ గుర్తించారు. దీంతో మంగళవారం నియోజకవర్గంలోని తహసీల్దార్లతో పాటు ఆర్డీవోపై కూడా ఆగ్రహించినట్లు తెలుస్తోంది. గంగవరం మండలంలో అత్యంత విలువైన 6 సెంట్ల స్థలం రెవెన్యూ రికార్డుల్లో చెరువు పోరంబోకుగా ఉంది. ఇక్కడ గతంలో పనిచేసిన ఓ తహసీల్దార్‌ ఆ రికార్డును మార్చేసి పట్టా చేసేందుకు కలెక్టరేట్‌కు ప్రపోజల్‌ పంపించారు. ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రాథమిక విచారణ చేసి ఆ తహసీల్దార్‌ను వెంటనే బదిలీ చేశారు. అతని మీద పూర్తి స్థాయి విచారణ ప్రారంభించనున్నారు. దీంతో పాటు వి.కోటలో కూడా రూ.కోట్ల విలువ చేసే 97 సెంట్ల స్థలాన్ని ఒకరు ఆక్రమించుకుని, రెవెన్యూ రికార్డుల్లో కూడా పేరు నమోదు చేయించుకున్నారు. దీన్ని కూడా కలెక్టర్‌ గుర్తించి, దాన్ని రద్దు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన ఓ సమావేశంలో కలెక్టర్‌ ఆగ్రహించి, తహసీల్దార్ల పేర్లు చెప్పకుండా అందర్నీ ఉద్దేశించి కోప్పడినట్లు తెలుస్తోంది.ఆర్డీవో పర్యవేక్షణలేమితోనే ఇలాంటివి జరుగుతున్నాయని, ఇవి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పని హెచ్చరించినట్లు సమాచారం

Updated Date - Oct 08 , 2025 | 01:09 AM