గనుల లెక్కలు తేలుస్తున్నారు..!?
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:34 AM
రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చడంలో గనులు, భూగర్భ శాఖ ప్రముఖమైంది. ఈ శాఖ ద్వారా మన జిల్లానుంచే ఏటా సుమారు రూ.160 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. ఇక్కడి గ్రానైట్‌కు పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మంచి గిరాకీ వుండడంతో ఎక్కువమంది ఈ వ్యాపారంపై మక్కువ చూపుతున్నారు.గత వైసీపీ ప్రభుత్వం సీనరేజ్ (ఆదాయం) వసూలు బాధ్యతను రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు అప్పగించి చేతులు దులుపుకుంది. ప్రభుత్వం మారడం, ఏజెన్సీ గడువు ముగియడంతో ఆ బాధ్యతలను గనుల శాఖాధికారులే చూస్తున్నారు.
చిత్తూరు సెంట్రల్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చడంలో గనులు, భూగర్భ శాఖ ప్రముఖమైంది. ఈ శాఖ ద్వారా మన జిల్లానుంచే ఏటా సుమారు రూ.160 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. ఇక్కడి గ్రానైట్‌కు పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మంచి గిరాకీ వుండడంతో ఎక్కువమంది ఈ వ్యాపారంపై మక్కువ చూపుతున్నారు.గత వైసీపీ ప్రభుత్వం సీనరేజ్ (ఆదాయం) వసూలు బాధ్యతను రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు అప్పగించి చేతులు దులుపుకుంది. ప్రభుత్వం మారడం, ఏజెన్సీ గడువు ముగియడంతో ఆ బాధ్యతలను గనుల శాఖాధికారులే చూస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువమంది క్వారీ వ్యాపారం చేయడంపై మొగ్గు చూపుతుండడంతో క్షేత్రస్థాయిలో వివాదాలు, ఫిర్యాదులు అధికమవుతున్నాయి.కోర్టు కేసులుపెరుగుతున్నాయి.ఈ క్రమంలో గనుల శాఖపై యంత్రాంగం దృష్టి సారించింది. అనధికారిక క్వారీల నిర్వహణపైనా తనిఖీలు జరుపుతున్నారు.కడప రీజియన్ అధికారులు క్వారీల్లో తనిఖీలు చేస్తుండగా త్వరలో కేంద్ర బృందం రంగంలోకి దిగనుంది.కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా మైన్స్ అధికారులు గత నెల 31వ తేదీ నుంచి క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. గనుల శాఖ నుంచి టెక్నికల్ అసిస్టెంట్, రెవెన్యూ శాఖ నుంచి సర్వేయర్లు, పోలీసుశాఖ సిబ్బంది తనిఖీల్లో పాల్గొంటున్నారు.
లెక్కల ప్రకారం 433 క్వారీలు
భూగర్భ గనుల శాఖ లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలో 433 క్వారీలున్నాయి. వీటిలో బ్లాక్ గ్రానైట్ 160 కాగా, కలర్ గ్రానైట్ 153, కంకర (గ్రావెల్స్) 9, సున్నపురాళ్లు (క్వార్ట్ ్జ్జ) 2, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ 92, రోడ్‌మెటల్, బిల్డింగ్ స్టోన్, కంకర 17 యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో 236 క్వారీలు పనిచేస్తుండగా, నిలిచిపోయిన కార్వీల్లో ఏడాది కాలంలో 58 రెన్యువల్ చేశారు. మరో 32 క్వారీలకు డెడ్ రెంట్ కట్టారు.2014 నుంచి క్వారీల కోసం ఏకంగా 2,485 దరఖాస్తులు రాగా ప్రాధాన్య క్రమంలో కేటాయిస్తూ వస్తున్నారు. వీటిలో 14 క్వారీలు మంజూరవగా, మరో 18 సర్వే దశలో ఉన్నాయి. జిల్లా గనుల శాఖ కార్యాలయంలో ఇటీవలే రికార్డులను తనిఖీ చేశారు.క్వారీల్లో ఎన్ని నడుస్తున్నాయి, ఎన్ని రెన్యువల్ చేశారు, నిబంధనలు అనుసరించి అనుమతులు ఇచ్చారా, గనులు సక్రమంగా నడుస్తున్నాయా, ఎక్కడైనా అక్రమణలు జరిగాయా.. అనే అంశాలపై రికార్డులను పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలనా చేపట్టారు.
క్వారీల్లో అక్రమాలు గుర్తించాం
రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో కలిసి గత నెల 31 నుంచి గనుల్లో తనిఖీలు చేపట్టాం.అనుమతులు, వినియోగం, హద్దులు.... ఇలా అన్ని కోణాల్లోనూ సర్వే చేస్తున్నాం. ఇప్పటివరకు పలు గనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించాం. ఇందుకు సంబంధించి నివేదికలు సిద్ధం చేస్తున్నాం. పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తాం.
- ఎస్‌ఏవీ సత్యనారాయణ, మైన్స్ డీడీ