ఏఆర్ కానిస్టేబుల్ డిస్మిస్
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:11 AM
హైదరాబాదు డ్రగ్స్ కేసులో ఏ1 నిందితుడైన తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్‌ను డిస్మిస్ చేస్తూ డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మరో రిజర్వు హెడ్ కానిస్టేబుల్ కూడా అరెస్టు
హైదరాబాదు డ్రగ్స్ కేసు పర్యవసానం
తిరుపతి(నేరవిభాగం), జూన్ 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాదు డ్రగ్స్ కేసులో ఏ1 నిందితుడైన తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్‌ను డిస్మిస్ చేస్తూ డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో ఇతడితోపాటు తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పూజారి రామచంద్ర కూడా నిందితుడు. వీరిద్దరినీ బుధవారం తిరుపతిలో కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేయడంతో పోలీసువర్గాల్లో సంచలనం కలిగించింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన విధుల్లో ఉండే వీరిద్దరూ డ్రగ్స్ సరఫరాలో కీలకంగా ఉండటం జిల్లాలో సంచలనం కలిగించింది. కేవీపల్లెకు చెందిన రామచంద్ర తిరుపతిలోని శ్రీకృష్ణనగర్‌లో నివాసం ఉంటున్నాడు. గుణశేఖర్‌లాగే ఇతడి పనితీరుపైనా ఆరోపణలున్నాయి. గతంలో రైల్వేలో పనిచేస్తుండగా డిస్మిస్ కావడమే నిదర్శనం. మూడు రోజుల కిందట హైదరాబాదుకు చెందిన ఎస్‌ఓటీ పోలీసులు ఒక దాబాపై దాడులు చేసి అక్కడ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న క్రమంలో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర, కానిస్టేబుల్ గుణశేఖర్ కొంత కాలంగా మంచి మిత్రులని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో రైల్వేలో పనిచేస్తూ సర్వీసు నుంచి డిస్మిస్ అయిన రామచంద్ర.. 1991లో రిజర్వు విభాగంలో కానిస్టేబుల్‌గా చేరి.. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. పదేళ్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో క్యాష్ ఆర్డర్లీ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడి విధి నిర్వహణ పట్ల గతంలో పలు ఆరోపణలు, విమర్శలు వచ్చినా వివిధ డ్యూటీల నిమిత్తం జిల్లా పోలీసు కార్యాలయానికి అధికారులు పంపడం గమనార్హం. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన ఓ అధికారికి ఇతడు అత్యంత సన్నిహితంగా ఉండటమే దీనికి కారణమన్న విమర్శలున్నాయి. మరోవైపు వీరిద్దరూ కొంత కాలంగా జిల్లా పోలీసు శాఖకు చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని కొందరు వైసీపీ నాయకులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. వీరిద్దరు కొంత కాలంగా గంజాయితో పాటు నార్కోటిక్ డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తెప్పించి ఒంగోలు, గుంటూరు మీదుగా హైదరాబాదుకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో పాటు హైదరాబాదు పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.