Share News

గత పాలకవర్గ తప్పిదాలపై తదుపరి విచారణకు ఆమోదం

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:08 AM

గత పాలకవర్గ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, అవినీతి, అక్రమాలపై తదుపరి విచారణకు జిల్లా సహకార బ్యాంకు ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

గత పాలకవర్గ తప్పిదాలపై తదుపరి విచారణకు ఆమోదం
సమావేశంలో మాట్లాడుతున్న రాజశేఖర రెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గత పాలకవర్గ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, అవినీతి, అక్రమాలపై తదుపరి విచారణకు జిల్లా సహకార బ్యాంకు ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శుక్రవారం స్థానిక బ్యాంకు ప్రధాన కార్యాలయ ఆవరణంలో చైర్మన్‌ అమాస రాజశేఖర రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. డీసీవో లక్ష్మి మాట్లాడుతూ వైసీపీ సర్కారు హయాంలో అప్పటి చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ నాయకత్వంలో అప్పటి నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీ బృందం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. డీఆర్వో మోహన్‌కుమార్‌ వందమందికి పైగా సాక్షులను నాలుగు నెలల వ్యవధిలో విచారించి కలెక్టర్‌కు నివేదిక అందించారని చెప్పారు. ఆ నివేదికలో అంశాలపై సభ్యుల అభిప్రాయాలను తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. దాంతో సమావేశం ఏకగ్రీవంగా తదుపరి విచారణకు ఆమోదం తెలుపుతూ అప్పటి పాలకవర్గంపై విచారణ కొనసాగించాలని సిఫార్సు చేసింది.బ్యాంకుకు జరిగిన నష్టాలను వారినుంచే రాబట్టాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు నిష్పక్షపాతంగా తదుపరి విచారణ జరపాల్సిందేనని కోరారు. చైర్మన్‌ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరుతో ముగియనున్న ఖరీఫ్‌ పంట కాలంలో స్వల్పకాలిక రుణాల రూపేణా రూ.3 లక్షలు, దీర్ఘకాలిక రుణాల రూపేణా యూనిట్‌ ఆధారంగా రూ.20 లక్షల వరకు, స్వల్పకాలికేతర రుణాలుగా పంట రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. గ్రామీణ గృహ తనఖా కింద రూ.5 లక్షల వరకు, పీఎం సూర్యఘర్‌ పథకం కింద ఒక్కొక్కరికి రూ.3 లక్షల వరకు పరిమితి లేకుండా విరివిగా రుణాలందించాలని సింగిల్‌ విండోల అధ్యక్షులకు సూచించారు. ఈ రుణాల ద్వారా సంఘాలను లాభదాయక మార్గాల్లో నడిపి గ్రామీణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.బ్యాంకు సీఈవో శంకర్‌ బాబు, డీసీఏవో నారాయణమ్మ, ఏజీఎం సురేష్‌ బాబు, లీగల్‌ ఆఫీసర్‌ వై. గంగిరెడ్డి, 75 సింగిల్‌ విండోల అఫిషియల్‌, నాన్‌ అఫిషియల్‌ కమిటీల చైర్మన్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:08 AM