Share News

పరకామణి చోరీ ఘటనపై హైకోర్టులో మరో పిల్‌

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:52 PM

తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో రవికుమార్‌ చోరీకి పాల్పడిన వ్యవహారం అంతకంతకూ వేడెక్కుతోంది

పరకామణి చోరీ ఘటనపై  హైకోర్టులో మరో పిల్‌

తిరుపతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో రవికుమార్‌ చోరీకి పాల్పడిన వ్యవహారం అంతకంతకూ వేడెక్కుతోంది. ఇప్పటికే దీనిపై దాఖలైన ఓ ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరుపుతున్న నేపధ్యంలో తాజాగా మరో పిల్‌ దాఖలైంది. ఈసారి శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోట్లాదిమంది భక్తుల కానుకలకు, మనోభావాలకు సంబంధించిన శ్రీవారి పరకామణిలో చోరీ వ్యవహారాన్ని మరింత తీవ్రంగా పరిగణించాలని, ప్రస్తుత దర్యాప్తు కాకుండా ప్రత్యేకంగా సిట్‌ ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఏపీ పోలీసు, టీటీడీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగ అధికారులను సిట్‌లో సభ్యులుగా నియమించాలని కోరారు. లేనిపక్షంలో కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని అలా కాకుంటే రిటైర్డు హైకోర్టు జడ్జితో విచారణ కమిషన్‌ అయినా ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. పరకామణిలో చోరీ ఘటనపై తిరుమల వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 24-2023 క్రైమ్‌ నంబరుతో నమోదైన కేసును తిరుపతి కోర్టులో లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ కుదుర్చుకోవడం వెనుక పెద్ద కుట్ర దాగివుందని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏమి జరిగిందో తేల్చేందుకు లోతుగా సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరముందని, ఆ దిశగా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. రవి నాయుడు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐని, ఏపీ ప్రభుత్వాన్ని, దేవదాయ శాఖను, హోమ్‌ శాఖను, డీజీపీని, టీటీడీ ఈవో, టీటీడీ సీవీఎ్‌సవోలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రవినాయుడు మంగళవారం దాఖలు చేసిన పిల్‌పై ఆయన తరపున సీనియర్‌ న్యాయవాదులు మెస్సర్స్‌ ఉమేష్‌ చంద్ర, వడ్డి సోమశేఖర్‌, కర్రా మాధవి, కె.హరికృష్ణ తదితరులు హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. కాగా ఇప్పటికే హైకోర్టులో ఇదే విషయమై దాఖలైన పిల్‌పై విచారణ జరుగుతుండగా హఠాత్తుగా శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు విడిగా మరో పిల్‌ దాఖలు చేయడం గమనార్హం. ఇప్పటికే నడుస్తున్న కేసులో హైకోర్టు సీఐడీకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. సీఐడీకి అప్పగిస్తే దర్యాప్తు బాగా ఆలస్యం అవుతుందని రవినాయుడు భావిస్తున్నట్టు సమాచారం. దర్యాప్తు బాధ్యతలు సిట్‌కు లేదా సీబీఐకి అప్పగిస్తే ఆ ప్రక్రియ వేగంగా ముగిసి పరకామణి చోరీ వ్యవహారంలో తెర వెనుక ఏమి జరిగిందనేది త్వరగా బయటపడుతుందనే ఉద్దేశంతోనే విడిగా పిల్‌ దాఖలు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా పరకామణి చోరీ వ్యవహారంలో కూటమి పార్టీల నేతలు చేసిన ఆరోపణలు ప్రజల ముందు వాస్తవమని తేలాలంటే లోతైన దర్యాప్తు అది కూడా త్వరగా జరగాలని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే కేసును నీరుకార్చకుండా ప్రజల ముందు ముఖ్యంగా శ్రీవారి భక్తుల ముందు వాస్తవాలు వుంచాలని వారు తాపత్రయపడుతున్నట్తు సమాచారం. అందులో భాగంగానే శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు రంగంలోకి దిగి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసినట్టు తెలిసింది. వారం పది రోజుల్లో ఈ పిటిషన్‌ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది. ఆపై కోర్టు నిర్ణయం ఎలా వుంటుందో వేచి చూడాల్సి వుంది.

Updated Date - Oct 28 , 2025 | 11:52 PM