తిరుపతి కలెక్టరేట్‌కు మళ్లీ బాంబు బెదిరింపు
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:12 AM
పేల్చేస్తామంటూ మెయిల్ ఉత్తిదే అని తేల్చిన పోలీసులు
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌కు మరోసారి ఫేక్ బాంబు బెదిరింపు వచ్చింది. ‘కలెక్టర్ అన్నయ్యా.. మేము మద్రాస్ టైగర్స్. జైలులో ఉన్న టీఎన్‌ఎల్‌ఏ నాయకుడు ఎస్.మారన్ సైబర్ గొరిల్లాల విభాగం. పాకిస్తాన్, ఐఎ్‌సఐ తదితరుల సాయంతో పేలుళ్లకు పాల్పడుతున్నాం. కలెక్టర్ కార్యాలయంలో ఐదు శక్తిమంతమైన బాంబులు అమర్చబడ్డాయి. అవి మధ్యాహ్నం పేలుతాయి’ అంటూ తమిళనాడు నుంచి తిరుపతి ఆర్డీవో, కలెక్టర్ అధికారిక మెయిళ్లకు శక్రవారం వేకువజామున 3.38 గంటలకు మెయిల్ వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబు.. డాగ్ స్క్వాడ్లు కలెక్టరేట్‌కు చేరుకుని అణువణువునా తనిఖీ చేశారు. అది ఉత్తుత్తి ఫేక్ మెసేజ్ అని పోలీసులు నిర్ధారించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తనిఖీల్లో తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్, సిబ్బంది కూడా పాల్గొన్నారు.