Share News

అనిల్‌.. అసాధ్యుడే

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:45 AM

మా వైసీపీ సోషల్‌ విభాగం అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి అమాయకుడు. పవన్‌పై దాడి ఘటనలో అతడికి సంబంధం లేదు. ఇదీ ఆయన అరెస్టు సందర్భంగా తిరుపతి ఈస్ట్‌ పోలీసుతో వైసీపీ నేతల వాదన.

అనిల్‌.. అసాధ్యుడే
వైసీపీ సోషల్‌ మీడియా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ రెడ్డి కార్యాలయంలో పవన్‌కుమార్‌ను చితకబాదుతున్న అనిల్‌కుమార్‌ రెడ్డి

వైసీపీ ప్రభుత్వంలో సెటిల్మెంట్లు

పవన్‌పై దాడి ఘటనలో కీలక నిందితుడు

వీడియో ఆధారాలతో కేసు నమోదు

ఫైబర్‌ లాఠీ ఇచ్చింది ఏఎ్‌సఐ కుమారుడు!

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మా వైసీపీ సోషల్‌ విభాగం అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి అమాయకుడు. పవన్‌పై దాడి ఘటనలో అతడికి సంబంధం లేదు. ఇదీ ఆయన అరెస్టు సందర్భంగా తిరుపతి ఈస్ట్‌ పోలీసుతో వైసీపీ నేతల వాదన. కానీ, ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ అనిల్‌కుమార్‌రెడ్డి అమాయకుడు కాదు.. అసాధ్యుడని తెలుస్తున్నట్లు సమాచారం. రెంటల్‌ బైకు తీసుకుని అద్దె చెల్లించలేదంటూ పులిచెర్ల మండలం మొరవపల్లికి చెందిన పవన్‌కుమార్‌ను గత బుధవారం మధ్యాహ్నం తిరుపతిలోని అనిల్‌ కార్యాలయానికి పట్టుకొచ్చారు. ఫైబర్‌ లాఠీ, దుడ్డుకర్రతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ అమానవీయంగా దాడి చేశారు. ఈ వీడియోలు వైరల్‌ కావడంతో భూమన అభినయ్‌ అనుచరుడు, నమ్మినబంటు అయిన అనిల్‌కుమార్‌రెడ్డి పేరు ప్రముఖంగా బయటకు వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సెటిల్మెంట్లు, ఆర్థిక లావాదేవీలకు అనిల్‌ పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. భూ దందాలు చేసినట్లు చెబుతున్నారు. ఓ నేతకు ఇతడు బినామీ అన్న ప్రచారమూ జరుగుతోంది. ఇతడి వద్ద ఓ బ్యాచ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతడి సెల్‌ఫోను కాంటాక్ట్స్‌, కాల్‌డేటా ఆధారంగా ఆ బ్యాచ్‌ను గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాచ్‌తో అనిల్‌ దౌర్జన్యాలు, దందాలు చేసేవాడని పోలీసుల విచారణలో బయటకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలోనే ఇతడిని వైసీపీ సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఈ దౌర్జన్యాలు, దందాల నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం రాగానే తన నివాసాన్ని ఎస్టీవీ నగర్‌ నుంచి పద్మావతిపురంలోని భూమన ఇంటి సమీపానికి మార్చినట్లు చెబుతున్నారు. ఇటీవల ఎస్టీవీనగర్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి అనిల్‌ సోదరుడు, తండ్రిపైనా కేసు నమోదు కావడం గమనార్హం. కాగా, పవన్‌ కుమార్‌పైనా అనిల్‌కుమార్‌రెడ్డి దాడి చేసినట్లు.. విచక్షణారహితంగా దినేశ్‌ కొట్టే సమయంలోనూ పక్కనే ఉన్నట్లు వీడియోల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులైన అనిల్‌కుమార్‌ రెడ్డి, జగదీశ్వర రెడ్డి టీమ్‌లో ఫైనాన్సు లావాదేవాలు నడుపుతున్న దినేష్‌ ఉన్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురూ రిమాండులో ఉన్నారు. కాగా, దినేష్‌ జనసేన పార్టీ నేత అంటూ వైసీపీ ప్రచారం చేసింది. ఈ క్రమంలో తమ పార్టీకి, అతడికి సంబంధం లేదంటూ జనసేన ముఖ్య నేతలు పోలీసులకు స్పష్టం చేసినట్లు సమాచారం.

15కాదు.. 50 మంది

పవన్‌పై దాడి ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో నిందితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తొలి రోజున నలుగురు, ఆ తర్వాత 15 మంది అని అంచనాకు రాగా.. ఇప్పుడా సంఖ్య 50కి చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీరంతా అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడపకు చెందిన వైసీపీ బ్యాచ్‌గా భావిస్తున్నారు. చిత్తూరులో పవన్‌కుమార్‌ను బంధించి అతడి ద్వారా బలవంతంగా సెల్ఫీ వీడియోలు తీయించిన రవి అనే చోటా రౌడీ కూడా పోలీసుల అదుపులో వున్నట్లు తెలిసింది.

ఫైబర్‌ లాఠీ ఇచ్చింది ఏఎ్‌సఐ కొడుకు!

పోలీసులు వాడే ఫైబర్‌ లాఠీతో పవన్‌కుమార్‌ను దినేశ్‌ చితకబాదిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఫైబర్‌ లాఠీ వీరికి ఎక్కడిదన్న ప్రచారం జరిగింది. ఈ దిశగా పోలీసులూ విచారించగా.. జిల్లాలో పనిచేసే ఓ ఏఎ్‌సఐ కుమారుడు ఇచ్చినట్లు బయట పడిందని తెలిసింది. వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఇతడు.. లాఠీ తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Updated Date - Aug 12 , 2025 | 01:45 AM