ఇంకా వైసీపీ వీరవిధేయులే!
ABN , Publish Date - Mar 18 , 2025 | 01:27 AM
ఎమ్మెల్యేలు కోరినా బదిలీ కాని పోలీసులు వైసీపీ నేతలతో సంబంధాల కొనసాగింపు
‘నా నియోజకవర్గంలో ఓ ఏఎస్‌ఐ, ఓ హెడ్‌కానిస్టేబుల్ ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేశారు. వైసీపీ అభ్యర్థికి టికెట్ కన్‌ఫర్మ్ అయినప్పుడు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. వారిని బదిలీ చేయమని నెలలుగా ఎస్పీ మణికంఠను అడుగుతున్నాను. స్పందన లేదు. వాళ్లేమో వైసీపీ ఇన్‌ఛార్జికి ఇన్‌ఫార్మర్లుగా ఉన్నారు. జీడీనెల్లూరుకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు కూడా ఎస్పీకి మరోసారి అర్జీ ఇచ్చినా ఫలితం లేదు. ఇలాంటి అధికారులను చూస్తుంటే అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాననిపిస్తోంది.’
--- ఓ ఎమ్మెల్యే ఆవేదన
చిత్తూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వం మారి తొమ్మిది నెలలైనా జిల్లాలో ఇంకా వైసీపీ వీర విధేయ పోలీసులే పని చేస్తున్నారు. పార్టీ ముద్ర వేసుకున్న పోలీసులకు అధికారం మారినప్పుడు స్థానచలనం జరుగుతుంటుంది. అయితే ఈసారి అలా జరక్కపోవడంతో వారంతా స్థానిక వైసీపీ నాయకులకే విధేయులుగా ఉండడంతో అధికార పార్టీ నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పక్క మండలాలకు మార్చాలని చెప్పినా ఎస్పీ మణికంఠ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. తాజాగా పుంగనూరులో టీడీపీ కార్యకర్త హత్య ఘటనలో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావించి ఎస్పీ మణికంఠ తీరును తప్పుబట్టారు. మరికొందరు పోలీసు అధికారులు జిల్లా ఉన్నతాధికారి పేరు చెప్పుకుని స్థానిక ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను లెక్క పెట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
తిరుపతి చర్యలు చిత్తూరుకు వర్తించవా?
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు అప్పటి ఎస్పీ సుబ్బరాయుడికి సంబంధం లేకపోయినా వెంటనే బదిలీ చేశారు. సుబ్బరాయుడు సుదీర్ఘకాలం చంద్రబాబుకు సీఎస్‌వోగా పనిచేసినా వెనుకాడలేదు. కానీ, పోలీసుల వైఫల్యంతో ఏకంగా టీడీపీ కార్యకర్తను దారుణంగా నరికి చంపితే కేవలం సీఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని జిల్లా టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.
స్థానచలనం లేని పోలీసులు
పలమనేరు నియోజకవర్గంలో ఓ మహిళా పోలీసు అధికారి వైసీపీ హయాం నుంచీ పనిచేస్తున్నారు. ఆమె తంబళ్లపల్లె నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పుడు ఆ ప్రాంత వైసీపీ నేత, ఎంపీ మిథున్‌రెడ్డి ముఖ్య అనుచరుడిని వివాహం చేసుకున్నారు. ఈ విషయం చెప్పి బదిలీ చేయమని కోరినా ఎస్పీ స్పందించడం లేదని అమరనాథరెడ్డి మూడురోజుల క్రితం ప్రెస్‌మీట్‌లో చెప్పిన విషయం తెలిసిందే.
బైరెడ్డిపల్లె స్టేషన్‌లో వైసీపీ హయాం నుంచీ పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ తమ్ముడు పలమనేరు మున్సిపాలిటీ వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. అతన్ని పక్క మండలానికి మార్చమని ఆరు నెలలుగా కోరుతున్నా ఫలితం లేదు.
ఫ పలమనేరులో ఓ ఏఎస్‌ఐ వైసీపీ హయాం నుంచీ కొనసాగుతూ ఇల్లీగల్ వ్యవహారాలకు పాల్పడుతూ ఉన్నతాధికారులను మామూళ్లతో మేనేజ్ చేసేవాడు. ప్రభుత్వం మారాక ఇల్లీగల్ వ్యవహారాలు ఆపేసినా, వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. బైరెడ్డిపల్లెలో ఓ మహిళా కానిస్టేబుల్ గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసి ఇప్పటికీ అక్కడే ఉంటూ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారు.
పెద్దపంజాణి స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ వైసీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు చేసి పైఅధికారులకు మామూళ్లు ఇచ్చేవాడు. బదిలీ కోసం అమరనాథ రెడ్డి ఇచ్చిన జాబితాలో ఇతని పేరు కూడా ఉంది.
చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప దగ్గరి బంధువు పలమనేరు నియోజకవర్గంలోని ఓ స్టేషన్‌లో వైసీపీ హయాం నుంచీ రైటర్‌గానే పనిచేస్తున్నారు.
వైసీపీ హయాంలో పలమనేరులో సీఐగా పనిచేసిన ఓ అధికారి ఇప్పుడు చిత్తూరులో కూడా కీలక స్థానంలో ఉన్నారు.తనకు ఉన్నతాధికారి అండ వుందని చెప్పుకునే అతడు స్థానిక ప్రజాప్రతినిధుల్ని లెక్కపెట్టడం లేదు. ఇటీవల ఓ దొంగతనం కేసులో నిందితుడి నుంచి ఏకంగా రూ.12.50లక్షలు తీసుకున్నా ఉన్నతాధికారులు అతన్ని కాపాడుతున్నారనే డిపార్ట్‌మెంటులో చెప్పుకుంటున్నారు.
వైసీపీ హయాంలో నగరి కేంద్రంలో పనిచేసిన ఓ మహిళా అధికారి ఇప్పుడు జీడీనెల్లూరు నియోజకవర్గంలోనూ కీలక స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే, చిత్తూరు సమీప స్టేషనులో మరో మహిళా అధికారి వైసీపీ హయాం నుంచీ కొనసాగుతున్నారు.
శాంతి భద్రతలు కాపాడడంలో వైఫల్యం
జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు శాంతిభద్రతలు వైఫల్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ తన ప్రాణాలకు వైసీపీ నుంచి ముప్పుందని ముందే పోలీసులకు ఫిర్యాదు చేసినా, వీడియో విడుదల చేసినా చర్యలు తీసుకోలేదు.చివరకు ఆయన అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఫ నగరి మండలం తడుకుపేటలో రెండు సామాజికవర్గాల మధ్య విబేధాలొచ్చాయి. ఇరువర్గాల మధ్య పెద్దఎత్తున గొడవలు జరిగి వారం రోజులు శాంతిభద్రతలకు భంగం వాటిల్లింది.వీటిని ముందే పసిగట్టి మొగ్గలోనే కట్టడి చేయడంలో అక్కడి పోలీసులు విఫలమయ్యారు.ఫక్రికెట్ ఆడుకుంటున్న సమయంలో బంతి తగిలిందని వి.కోటలో మొదలైన గొడవ.. ఇరు మతాల మధ్య తారస్థాయికి చేరింది. వారం రోజుల పాటు కలెక్టర్, ఎస్పీ అక్కడే మకాం వేయాల్సి వచ్చింది.దీన్ని కూడా మొగ్గలోనే తుంచడంలో పోలీసులు విఫలమయ్యారు.ఫ చిత్తూరులో ఇటీవల ఏడుగురు బయటి ప్రాంతాల వ్యక్తులు నకిలీ తుపాకులతో పట్టపగలే దొంగతనానికి పాల్పడి పోలీసుల పనితీరును ప్రశ్నించారు.