Share News

తిరుపతిలో మళ్లీ పడగవిప్పిన అరాచకం

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:39 AM

తిరుపతిలో అరాచక భూతం మళ్లీ నిద్రలేచింది. కాస్త ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది అనుకునేలోగానే విచ్చలవిడి దాడులకు తెగబడుతున్నారు. దబాయింపులు.. దౌర్జన్యాలు.. హింసాత్మక సంఘటలూ పెచ్చుపెరుగుతున్నాయి. గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన దృశ్యాలు నగర ప్రజలను భయకంపితులను చేశాయి.

తిరుపతిలో మళ్లీ పడగవిప్పిన అరాచకం
పవన్‌కుమార్‌ను ఫైబర్‌ లాఠీతో విచక్షారహితంగా కొడుతున్న అనిల్‌రెడ్డి - ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌లో అనిల్‌రెడ్డి

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో అరాచక భూతం మళ్లీ నిద్రలేచింది. కాస్త ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది అనుకునేలోగానే విచ్చలవిడి దాడులకు తెగబడుతున్నారు. దబాయింపులు.. దౌర్జన్యాలు.. హింసాత్మక సంఘటలూ పెచ్చుపెరుగుతున్నాయి. గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన దృశ్యాలు నగర ప్రజలను భయకంపితులను చేశాయి. బకాయి ఉన్నాడంటూ ఒక దళిత యువకుడిని పోలీసులు వాడే ఫైబర్‌ లాఠీతో విచక్షారహితంగా కొడుతున్న దృశ్యాలు చూసిన వారి ఒళ్లు జలదరించింది.

కాళ్లతో తన్నారు. ఫైబర్‌ లాఠీతో చితకబాదారు. దుడ్డు కర్రతో విచక్షణారహితంగా కొట్టారు. ఒళ్లంతా రక్తమైనా, అన్నా.. వదలంటూ కాళ్లు పట్టుకున్నా, కనికరించలేదు. వైరల్‌ అయిన ఈ దాడి దృశ్యాలు పోలీసులకు చేరడంతో రంగంలోకి దిగారు. మరోవైపు బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తిరుపతి పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మొరవపల్లికి చెందిన నీలం జయరాజ్‌ కుమారుడు పవన్‌కుమార్‌ తిరుపతిలోని ఓ రెసిడెన్సీలో రిసెప్షనిస్టు. తిరుపతి వైసీపీ సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కారు డ్రైవర్‌ అయిన అనిల్‌కుమార్‌రెడ్డి శ్రీనివాసం ఎదురుగా ఎస్వీపీ బైక్‌ రెంటల్స్‌ పేరిట ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇస్తున్నాడు. నెల కిందట పవన్‌కుమార్‌ డియో హోండా బైక్‌ను అద్దెకు తీసుకున్నాడు. దాదాపు 20 రోజులుగా బాడుగ చెల్లించలేదు. ఈ క్రమంలో స్విమ్స్‌ వద్ద ఉన్న పవన్‌, అతడి స్నేహితుడిని అనిల్‌ అనుచరుడు, మరో బైక్‌ రెంటల్‌ యజమాని జగదీశ్వర రెడ్డి అలియాస్‌ జగ్గూ, అజయ్‌కుమార్‌ బుధవారం మధ్యాహ్నం అనిల్‌కుమార్‌రెడ్డి కార్యాలయానికి తీసుకొచ్చారు. అంతలో పాకాలకు చెందిన.. కొర్లగుంటలో ఉంటూ ఫైనాన్సు, సెటిల్‌మెంట్లు చేస్తున్న వైసీపీ నేత దినేష్‌ అక్కడకు చేరుకున్నాడు. ఫైబర్‌ లాఠీతో పవన్‌ను విచక్షణా రహితంగా దినేష్‌ కొట్టాడు. ఒళ్లు రక్తంతో కమిలిపోయి అన్నా.. కొట్టొద్దు.. కొట్టొద్దు అంటున్నా విడిచిపెట్టలేదు. చిత్రహింసలకు గురిచేశాడు. అనిల్‌కుమార్‌ రెడ్డి కూడా లాఠీతో చితకబాదాడు. ఈ ఘటనను పవన్‌ స్నేహితుడు వీడియోలు తీసి గ్రూపుల్లో వైరల్‌ చేశారు. ఈ వీడియోలను నీలం జయరాంకు అనిల్‌ పంపి.. మీ కుమారుడు మాకు డబ్బులివ్వాలని చెప్పడంతో తాను వచ్చి ఇస్తానని ఆయన చెప్పారు. అక్కడ్నుంచి పవన్‌కుమార్‌ను పంపేశారు.

అదుపులో ముగ్గురు నిందితులు

కాగా, వైరల్‌ అయిన వీడియోలు పోలీసులకూ చేరాయి. నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ భక్తవత్సలం నేతృత్వంలో వర్సిటీ సీఐ రామయ్య, ఈస్ట్‌ ఎస్‌ఐ గిరిబాబు, ఈస్ట్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జ్యోతినాధ్‌, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పద్మావతి పురంలో ఉన్న అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల హెచ్చరికలతో బుధవారం అర్ధరాత్రి జగదీశ్వరరెడ్డి ఈస్ట్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. వీరిని విచారించాక దినేష్‌, అజయ్‌కుమార్‌ కూడా ఉన్నట్లు తెలిసింది. గురువారం సాయంత్రం దినే్‌షను చింతలచేను బస్టాపు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు పోలీసుల అదుపులో ఉండగా, అజయ్‌కుమార్‌ పరారయ్యాడు. బాధితుడి తండ్రి జయరాజ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పలు సెక్షన్ల కింద కేసులు: డీఎస్పీ

నిందితులు అనిల్‌కుమార్‌ రెడ్డి, దినేష్‌, జగదీశ్వర రెడ్డిలను అదుపులోకి తీసుకుని కిడ్నాప్‌, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ, చిత్రహింసలకు గురి చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం గురువారం చెప్పారు. వీరిపై రౌడీషీట్‌ ఓపన్‌ చేస్తామన్నారు. శాంతి భధ్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా వదలి పెట్టేది లేదన్నారు. ఈ దాడి ఘటనలో నిందితులైన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వంగలపూడి అనిత పోలీసులను ఆదేశించారు. ఈ ఘటన వెనుక సూత్రధారులను వదలిపెట్టేది లేదన్నారు.

పవన్‌ ఎక్కడ?

ఈ ఘటన తర్వాత పవన్‌ కనిపించలేదు. ఆయన మొబైల్‌ ఆన్‌ చేసి.. తర్వాత ఆఫ్‌ చేస్తున్నారు. ఇతడి కోసం సీఐ రామయ్య, సిబ్బంది గాలించారు. కల్లూరు మండలం ఇస్త్ర్తాకులపల్లె వద్ద స్నేహితుడు జానకిరామ్‌తో పవన్‌ ఉన్నట్లు గుర్తించి వెళ్లారు. అప్పటికే పవన్‌ వెళ్లిపోగా, జానకిరామ్‌ను మాత్రం గురువారం రాత్రి తిరుపతికి తీసుకొచ్చారు.

రూ.5 లక్షలు ఇవ్వకుంటే శవాన్ని పంపిస్తాం

నిందితులు బెదిరించారంటూ పవన్‌ తల్లి ఆవేదన

‘మీ కొడుకు మావద్ద బైక్‌ రెంటల్‌కు తీసుకుని డబ్బులు ఇవ్వలేదు. అతడిని కొట్టిన వీడియోలు మీకు పంపాము. రూ.5 లక్షలు సాయంత్రానికంతా (బుధవారం) పంపకుంటే మీ కొడుకు కిడ్నీ తీసుకుని, శవాన్ని ఇంటికి పంపిస్తామని మాకు రెండు, మూడు నెంబర్ల నుంచి ఫోన్‌ చేశారు. మేము భయపడి పోయి మా కొడుకుని కాపాడాలంటూ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అంటూ పవన్‌ తల్లి సునీత గురువారం ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ‘తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ రక్తం వచ్చేట్లు లాఠీతో కొట్టడానికి వీళ్లెవరు? బాగా కొట్టి.. ఇప్పుడు కనిపించకుండా చేశారు. వెంటనే నిందతులను అరెస్టు చేసి నా బిడ్డను కాపాడాలి’ అంటూ ప్రాధేయపడ్డారు. ఆమెకు మద్దతుగా అంబేడ్కర్‌ సంఘం జిల్లా నాయకులు ధనశేఖర్‌, రమేష్‌, సమతా సైనిక దళ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవి, ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రసాదరావు తదితరులు ధర్నా చేశారు.

Updated Date - Aug 08 , 2025 | 01:39 AM