ఆనందరెడ్డి మళ్లీ సస్పెన్షన్
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:48 AM
రేణిగుంట ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆనందరెడ్డి మళ్లీ సస్పెండయ్యారు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో స్టాంపుల, రిజిస్ట్రేషన్ శాఖ విచారణకు ఆదేశించింది.
అవినీతి ఆరోపణలతో రేణిగుంట ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌పై చర్యలు
రేణిగుంట నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రేణిగుంట ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆనందరెడ్డి మళ్లీ సస్పెండయ్యారు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో స్టాంపుల, రిజిస్ట్రేషన్ శాఖ విచారణకు ఆదేశించింది. గత నెల అనంతపురం, నెల్లూరు జిల్లాల డీఐజీలు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా భూములు రిజిస్ట్రేషన్ చేయడాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా ఆయన్ను సస్పెండు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా ఉంచడం గమనార్హం. ఇప్పటికే పలుమార్లు ఆయన సస్పెండయ్యారు.
2005లో ఆళ్లగడ్డలో సబ్ రిజిస్ట్రార్‌గా ఆనందరెడ్డి మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. 2007లో తిరుపతి రూరల్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ చేరిన మూడు నెలలకే సస్పెండయ్యారు. దీనికి కారణం.. ఆళ్లగడ్డలో ప్రభుత్వ.. నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై విచారించగా వాస్తవమని తేలడమే.
తిరిగి 2009లో తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదులు అందాయి. విచారణ చేపట్టిన అప్పటి ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది.
2010లో తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన రెండు నెలల్లోపే వెస్ట్ చర్చికి సంబంధించిన స్థలాన్ని ఇద్దరికీ ఒకే రోజు.. ఒకే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వ చలానాకు పన్నులు చెల్లించకపోవడంతో 2012లో డిస్మిషల్ ఫ్రం సర్వీస్ అయ్యారు.
మళ్లీ 2015లో తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన హయాంలో ఏసీబీ తనిఖీలు చేయగా లెక్కలో లేని సొమ్మును సీజ్ చేశారు. దీనిపై 2016లో ఆనంద్‌రెడ్డిని డిస్మషల్ ఫ్రం సర్వీస్ చేశారు.
తిరిగి 2020లో వైసీపీ నాయకుల అండదండలతో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2022లో వివాదాస్పద భూములు రిజిస్ట్రేషన్లు చేయడం, రిజిస్ట్రేషన్ వేల్యూషన్ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నిబంధనలకు అతిక్రమించి రేణిగుంట మండలంలోని అనుగుంట ప్రాంతంలో 5 రెట్లు పెంచేశారు. వీటిపై అప్పట్లో ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
తిరిగి 2022 డిసెంబరులో ఆడిట్ సబ్ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ తెచ్చుకొని సెలవుపై వెళ్లారని విమర్శలున్నాయి.
2025 మార్చి 14న రేణిగుంట ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మళ్లీ అవినీతి ఆరోపణలు రావడం, ప్రభుత్వ విచారణలో వాస్తవమని తేలడంతో మరోసారి సస్పెండయ్యారు.