ఏఐ ఆధారిత వ్యవస్థతో తిరుమల లో అద్భుత ఫలితాలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:11 AM
తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో తెలిపారు.
తిరుమల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మూడు నెలల కిందట తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్1లో ప్రారంభించిన ఐసీసీసీ సెంటర్ పనితీరును సీవీఎస్వో మురళీకష్ణ, సెంటర్ నిర్వాహకులు జేపీ(వర్చువల్)తో కలిసి ఆయన మీడియాకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవిష్యత్తులో మంచి దర్శనం చేయించేందుకు డేటా జనరేట్ సిస్టమ్‌కు ఎంతోగానో సహాయ పడుతుందన్నారు. ఎన్‌ఆర్‌ఐ దాతల సహకారంతో రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఐసీసీసీని ప్రారంభించామని, ఇప్పటికే రూ.16.5 నుంచి రూ.17 కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక పరికరాలను సమకూర్చామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, పలు సూచనలు చేశారన్నారు. అదనపు ఈవో వివరించిన దాని ప్రకారం..
ఏఐ ఆధారిత వ్యవస్థవల్ల ఉపయోగం ఇదీ..
దర్శనానికి ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఏ కంపార్టుమెంట్లలో ఎంత సమయం వేచి ఉన్నారు, ఏ సమయంలో ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు, వారికి సకాలంలో అన్నప్రసాదాలు అందుతున్నాయా, కంపార్టుమెంట్లు ఏవైనా ఖాళీగా ఉన్నాయా వంటి వివరాలను ఈ వ్యవస్థ రికార్డు చేస్తుంది. ఎవరికి ముందు దర్శనం కల్పించాలో కూడా సూచన చేస్తుంది. కంపార్టుమెంట్‌లో 450 మందికి మించి భక్తులు ఉంటే వెంటనే రెడ్ అలర్ట్ ఇస్తుంది. ఒకవేళ తక్కువగా ఉంటే గ్రీన్ స్పేస్ కనిపిస్తుంది. వీరికి దర్శనానికి పట్టే సమయాన్ని కూడా తెలియజేస్తుంది. ఒక భక్తుడు ఎన్ని సార్లు దర్శనానికి వచ్చారు, ఏ సమయంలో ఎక్కడ ఉన్నాడు, ఎంత సమయంలో దర్శనం చేసుకున్నాడనే పూర్తి వివరాలు నమోదవుతాయి. ఇలా ప్రతి అంశం రికార్డు చేయడం ద్వారా దర్శన సమయాన్ని తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరిచేందుకు ఈ వ్యవస్థ కీలకంగా వ్యవహరించనుంది. ప్రస్తుతం తిరుమలలో, అలిపిరిలో ఎన్ని వాహనాలున్నాయి, ఎంత సమయం ఉన్నాయి, బ్లాక్ లిస్ట్‌లో ఉన్న వాహనాలేవైనా తిరుమలకు చేరుకున్నాయా, నో పార్కింగ్‌లో ఉన్న వాహనాలు ఎన్ని ఇలా ప్రతిదీ ఈ వ్యవస్థద్వారా తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్1, 2తో పాటు నారాయణగిరి షెడ్లు, రింగురోడ్డులోని క్యూలైన్‌లో ఉన్న 69 గేట్లతో పాటు నడకమార్గాలు, అలిపిరిలో అదనంగా సుమారు 250 ఆధునిక కెమెరాలను ఏర్పాటు చేసి ఐసీసీసీకి అనుసంధానం చేయనున్నారు.
భవిష్యత్తులో ఇవీ ప్రయోజనాలు..
ఫ కంపార్టుమెంట్లు, క్యూలైన్లలోని భక్తుల ఎమోషన్స్‌ని కూడా ఈ వ్యవస్థ ముందుగానే పసిగట్టి హెచ్చరిస్తుంది. ఏదైనా గొడవలు జరిగేట్టు ఉన్నా, అగ్నిప్రమాదాలు జరిగినా గుర్తించి ఆయా విభాగాల అధికారులకు సమాచారం చేరవేస్తుంది.
ఫ పాతనేరస్థుల డేటాను కూడా ఈ వ్యవస్థలో పొందుపరుస్తారు. వీరిలో ఏవరైనా క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోకి ప్రవేశిస్తే పసిగట్టి అలర్ట్ చేస్తుంది.
ఫ ఎవరైనా తప్పిపోతే, ఆ వ్యక్తి ఫొటోను అప్‌లోడ్ చేసిన వెంటనే ఎక్కడ ఉన్నారో సులువుగా గుర్తిస్తుంది.
ఫ ఎలక్ర్టికల్ వస్తువులతో పాటు నిషేధిత వస్తువులను గుర్తిస్తుంది.