Share News

కూటమి సంబరాలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:09 AM

ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సంబరాలు జరపాలని టీడీపీ ఎలాంటి పిలుపూ ఇవ్వలేదు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో నేతలు ఎలాంటి వేడుకలూ జరపలేదు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి వంటి చోట్ల మాత్రం నేతలు, శ్రేణులూ హంగామా చేశారు.

కూటమి సంబరాలు
తిరుపతిలో ఎమ్మెల్యే ఆరళణి నివాసం వద్ద బాణసంచా పేలుస్తున్న జనసేన శ్రేణులు

రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన అద్భుతంగా ఉందని.. రాక్షస రాజ్యం నుంచి విముక్తి లభించిందంటూ బుధవారం కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇక, పార్టీ ఆదేశాలతో వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం పేరిట నిరసన చేపట్టాయి. - తిరుపతి, ఆంధ్రజ్యోతి

ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సంబరాలు జరపాలని టీడీపీ ఎలాంటి పిలుపూ ఇవ్వలేదు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో నేతలు ఎలాంటి వేడుకలూ జరపలేదు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి వంటి చోట్ల మాత్రం నేతలు, శ్రేణులూ హంగామా చేశారు. తిరుపతిలో అలిపిరి పాదాల మండపం వద్ద ఏపీ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుగుణమ్మ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. టౌన్‌ క్లబ్‌ కూడలిలో టీడీపీ మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ నేతృత్వంలో ఎన్టీయార్‌ విగ్రహానికి నివాళులర్పించి కేక్‌ కట్‌ చేశారు. చంద్రగిరి టవర్‌ క్లాక్‌ సెంటర్‌లో టీడీపీ శ్రేణులు కేక్‌ కట్‌ చేసి బాణాసంచా కాల్చారు. ఎమ్మెల్యే పులివర్తి నానీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ పల్లినేని సుబ్రమణ్యం నాయుడు తదితరులతోపాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎన్టీఆర్‌ కూడలిలో టీడీపీ కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకోగా.. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. నాయుడుపేటలో సామాన్య టీడీపీ కార్యకర్త ఒకరు పేదలకు అన్నదానం చేశారు.

ఇక, జనసేన అధిష్ఠానం పిలుపుతో పలుచోట్ల పార్టీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చాయి. తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్టీవీ నగర్‌లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. సాయంత్రం ఎమ్మెల్యే నివాసం వద్ద దీపాలు వెలిగించి, బాణసంచా పేల్చారు. సూళ్ళూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోనూ జనసేన నాయకులు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చారు. బీజేపీ మాత్రం సంబరాలకు దూరంగా ఉంది.

వైసీపీ వెన్నుపోటు దినం

తిరుపతి సత్యనారాయణపురం కూడలి నుంచీ మున్సిపల్‌ పార్కు వరకూ వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం పేరిట ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయానికి వెళ్ళి టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వినతిపత్రం అందజేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, పార్టీ ఇంఛార్జి అభినయ్‌ తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరిలో ఇంఛార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో టవర్‌ క్లాక్‌ సెంటర్‌ నుంచీ వైసీపీ శ్రేణులు తహసిల్దారు కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. నాయుడుపేటలో జరిగిన నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.. గూడూరులో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌, శ్రేణులు పాల్గొన్నారు. అధికారం కోల్పోయాక తొలిసారి వైసీపీ శ్రేణులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టినా మునుపటి జోష్‌ కనిపించలేదు.

Updated Date - Jun 05 , 2025 | 01:09 AM