స్కూల్ బ్యాగ్‌లో మద్యం
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:17 AM
చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో మద్యం తాగొచ్చిన విద్యార్థిని ఉపాధ్యాయులు మందలించగా.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు.
టీచర్లు మందలించారని విద్యార్థి ఆత్మహత్య
చంద్రగిరి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో మద్యం తాగొచ్చిన విద్యార్థిని ఉపాధ్యాయులు మందలించగా.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఎం.కొంగరవారిపల్లె ఉన్నత పాఠశాలలో సమీప గ్రామానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం ఇతడు మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పారు. అతడి స్కూల్ బ్యాగ్‌ను ఉపాధ్యాయులు తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు కనిపిండంతో హెచ్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ విద్యార్థిని హెచ్‌ఎం మందలించి, పాఠశాలకు రావాలంటూ 11 గంటల సమయంలో అతడి తల్లితండ్రులకు సమాచారమిచ్చారు. ఇంతలో ఆ విద్యార్థి పాఠశాల ప్రహరీ దూకి పరారయ్యాడు. అతడి కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు చుట్టు పక్కల గాలించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముంగిలిపట్టు సమీపంలో రైలు పట్టాలపై ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్లి పరిశీలించగా, చనిపోయింది ఆ విద్యార్థేనని నిర్ధారించారు. రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.