నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యం
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:09 AM
సదరన్ డిస్కం పరిధిలోని వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని నూతన సీఎండీ లోతేటి శివశంకర్ అన్నారు. తిరుపతిలోని డిస్కం ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుపతి, అక్టోబర్ 13(ఆంధ్రజ్యోతి): సదరన్ డిస్కం పరిధిలోని వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని నూతన సీఎండీ లోతేటి శివశంకర్ అన్నారు. తిరుపతిలోని డిస్కం ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగంలో సంస్కరణలను వేగంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేర్చడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా ఉన్న గ్రామాలను త్రీ ఫేజ్‌కు మార్చడం, ఆర్‌డీఎ్‌సఎస్ స్కీం అమలు చేయడం కీలక బాధ్యతలుగా భావిస్తున్నట్లు తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ అయిన సూర్యఘర్ వంటి పథకాల అమలును వేగవంతం చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో, సేవల్లో, విద్యుత్ నాణ్యతపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణం స్పందించి పరిష్కరించేలా యంత్రాంగం పనితీరును మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. డిస్కంలో ఖాళీ పోస్టుల భర్తీ విషయమై ప్రభుత్వం సమీక్షిస్తోందని, త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ‘స్మార్ట్ మీటర్ల ఏర్పాటు మంచిది. ఎంతో అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల్లోనూ వీటిని వాడుతున్నారు. ఈ మీటర్ల వల్ల రీడింగ్ కచ్చితంగా తెలుస్తుంది. ఇళ్లయినా, షాపైనా, పరిశ్రమలోనైనా ఎంత లోడ్ ఉందో తెలుస్తుంది. ఆ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సరఫరాను మరింత మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందన్నారు. దీనిపై ఎలాంటి అపోహలు వద్దు’ అని సూచించారు.
సీఎండీగా శివశంకర్ బాధ్యతల స్వీకరణ
తిరుపతి(ఆటోనగర్), ఆంధ్రజ్యోతి: ఏపీ సదరన్ డిస్కం సీఎండీగా ఎల్.శివ శంకర్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. తిరుపతిలోని ప్రధాన కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకు ఆయన చేరుకోగా.. పూర్వపు సీఎండీ కె.సంతోషరావు స్వాగతం పలికారు. పూజల అనంతరం పూర్వపు సీఎండీ బాధ్యతలు అప్పగించారు. సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్, కె.గురవయ్య, రామమోహన రావుతో పాటు సీజీఎంలు, జీఎంలు, తిరుపతి సర్కిల్ ఎస్‌ఈ వి.చంద్రశేఖర్‌రావు, పలువురు ఎస్‌ఈలు, ఈఈలు, డీవైఈఈలు, ఏఈలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.