క్రిస్ సిటీతో రియల్ ఎస్టేట్ దూకుడు
ABN , Publish Date - May 06 , 2025 | 12:57 AM
క్రిస్ సిటీ, చెన్నై - బెంగళూరు కోస్టల్ కారిడార్ రానుండడంతో కోట మండలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎడాపెడా వెంచర్లు వేస్తూ వ్యాపారం షురూ చేశారు.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లు
ఎకరా రూ.2.5 కోట్లకు పైమాటే
కోట, మే 1 (ఆంధ్రజ్యోతి): క్రిస్ సిటీ, చెన్నై - బెంగళూరు కోస్టల్ కారిడార్ రానుండడంతో కోట మండలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎడాపెడా వెంచర్లు వేస్తూ వ్యాపారం షురూ చేశారు. కోట మండలం కొత్తపట్నం, చిల్లకూరు మండలం తమ్మినపట్నం ప్రాంతాల్లో క్రిస్‌సిటీ రానుంది. దీనికి సంబంఽధించిన పనులు వేగం పుంజుకున్నాయి. 250 నుంచి 300 పరిశ్రమల వరకు రానుండడంతో సముద్రతీర గ్రామాలన్నీ ఇండస్ర్టియల్ హబ్‌గా మారిపోనున్నాయి. సముద్రతీరానికి 20నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట, విద్యానగర్ ప్రాంతాల్లో ఇప్పటికే ఆక్వా పరిశ్రమలు ఉన్నాయి. దీనికితోడు క్రిస్‌సిటీ, చెన్నై-బెంగళూరు కోస్టల్ కారిడార్ ద్వారా కృష్ణపట్నం పోర్టు అనుసంధానం జరగనున్న నేపథ్యంలో కోట మండలంలోని సముద్రతీర గ్రామాలైన కొత్తపట్నం, శ్రీనివాససత్రం, గోవిందపల్లి, గోవిందపల్లిపాళెం, వావిళ్లదొరువు, గున్నంపడియ, యమదిన్నెపాళెం, సిద్ధవరం, కర్లపూడి గ్రామాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
రూ.వేల నుంచి రూ.లక్షలకు..
విద్యానగర్‌లో హనుమాన్ నగర్, గూడలి రహదారిలో గతంలో అంకణం రూ.40వేల నుంచి రూ.60వేలు పలుకుతుండగా ప్రస్తుతం రూ.2.30లక్షల వరకు పలుకుతోంది. చెందోడు, విద్యానగర్ ప్రాంతంలో ఎకరం రూ.2.5కోట్లకు పైనే పలుకుతోంది. చల్లకాలువ, స్వర్ణముఖి సమీపంలో కొత్తగా వేసిన వెంచర్లలో అంకణం రూ.1.20లక్షల నుంచి 1.40 లక్షలు పలుకుతోంది. ఆ ప్రాంతంలో ఎకరం రూ.2కోట్లకు పైగా పలుకుతోంది. ఇక కోట పట్టణానికి వస్తే అంబేడ్కర్ గురుకులం, రవినగర్ ప్రాంతాల్లో అంకణం రూ.1.50లక్షల నుంచి 1.60లక్షలు పలుకుతోంది. ఇంకొంచెం పట్టణంలోకి వెళితే రూ.1.70లక్షలు పలుకుతోంది. కోట పట్టణంలోనూ భూముల ధరలు బాగా పెరిగాయి. అదేవిధంగా గోవిందపల్లి, సిద్ధవరం, కర్లపూడి గ్రామాల్లో ఒకప్పట్లో ఎకరం రూ.10లక్షలు ఉండగా ప్రస్తుతం సెటిల్‌మెంట్ భూమి ఎకరం రూ.30 నుంచి రూ.40లక్షల వరకు పలుకుతోంది. కాగా, సముద్ర తీర ప్రాంతాల ప్రజలు భూములు, ఆస్తులు పరిశ్రమలకు వదిలివేసి విద్యానగర్, కోట ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పరుచుకునేందుకు పరుగులు తీస్తున్నారు. భూముల ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.