Share News

పంటలపై మళ్లీ ‘గజ’దాడులు

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:01 AM

పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు మళ్లీ మొదలయ్యాయి. కొన్ని నెలలుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు ఆగస్టు 17వ తేదీన తిరుపతి జిల్లా పాకాల మండలంలోకి వెళ్లిపోవడంతో మండల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

పంటలపై మళ్లీ ‘గజ’దాడులు
కల్లూరు సమీపంలో రోడ్డు దాటుతున్న ఏనుగు

ఆందోళనలో రైతులు

కల్లూరు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు మళ్లీ మొదలయ్యాయి. కొన్ని నెలలుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు ఆగస్టు 17వ తేదీన తిరుపతి జిల్లా పాకాల మండలంలోకి వెళ్లిపోవడంతో మండల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మూడ్రోజులపాటు పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ పరిధిలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిని దాటుకుని పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలోని ఐరాల సెక్షన్‌లోకి వెళ్లిపోయాయి. మామిడికాయల సీజన్‌ కూడా పూర్తవడంతో ఏనుగుల గుంపు తిరిగిరాకుండా అటు నుంచి అటే వెళ్లిపోతాయని ప్రజలు భావించారు. అయితే శనివారం రాత్రి ఉన్నట్టుండి ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలోని గోగులమ్మ వంక నుంచి శనివారం రాత్రి బయల్దేరిన 13 ఏనుగుల గుంపు కల్లూరులోని ఖాదర్‌బాషాకు చెందిన మామిడిచెట్లను ధ్వంసం చేశాయి. అక్కడినుంచి పాతపేట వద్దకెళ్లి గ్రామంలోని రామ్మూర్తికి చెందిన కొబ్బరిచెట్లను ధ్వంసం చేశాయి. సమీపంలో ఉన్న కల్లూరులోని సాధిక్‌, నవాబ్‌కు చెందిన మామిడి, కొబ్బరిచెట్లను విరిచేశాయి. మంగళంపేటలోని రామకృష్ణయ్యకు చెందిన మామిడిచెట్లను ధ్వంసం చేసి, చిట్టారెడ్డిపేట సమీపంలో జూలై 5న ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి చేరుకున్నాయి. పూరేడువాండ్లపల్లెలోని గుర్రప్పకు చెందిన వరిపంటను తొక్కేశాయి. అక్కడినుంచి ఆవులపెద్దిరెడ్డిగారిపల్లె సమీపానికి చేరుకున్న ఏనుగులు.. ఘీంకరిస్తూ వచ్చిన దారిలోనే తిరుగుముఖం పట్టాయి.

రోడ్డుపై ఒంటరి ఏనుగు హల్‌చల్‌

ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో కల్లూరు నుంచి గంటావారిపల్లెకి వెళ్లే రోడ్డుపై ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది. రోడ్డుపై కొంతదూరం నడవడాన్ని చూసిన జనం భయపడ్డారు. అనంతరం పొలాల్లో తిరుగుతూ అడవిలో ఉన్న ఏనుగుల గుంపులోకి చేరుకుంది. పగలంతా పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలోని గోగులమ్మ వంక సమీపంలో ఏనుగుల గుంపు తిష్ఠ వేసినట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.

Updated Date - Sep 01 , 2025 | 02:01 AM