Share News

ఐదేళ్లు దోచుకుని .... ఇప్పుడేమో ఎవరి ఖర్చులు వారివా?

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:15 AM

వైసీపీ అధినేత జగన్‌ బంగారుపాళ్యం పర్యటన నేపథ్యంలో జిల్లా వైసీపీ నేతల మధ్య పొరపొచ్చాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. బంగారుపాళ్యం మండలం పూతలపట్టు నియోజకవర్గంలోకి వస్తుండడంతో మొత్తం ఖర్చును అక్కడి ఇన్‌చార్జి సునీల్‌కుమార్‌ భరించాలని తొలుత ‘బడా’ నాయకుడు సూచించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యే కానని, అంత మొత్తం భరించలేనని ఆయన వివరణ ఇచ్చుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

 ఐదేళ్లు దోచుకుని .... ఇప్పుడేమో ఎవరి ఖర్చులు వారివా?

చిత్తూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ బంగారుపాళ్యం పర్యటన నేపథ్యంలో జిల్లా వైసీపీ నేతల మధ్య పొరపొచ్చాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. బంగారుపాళ్యం మండలం పూతలపట్టు నియోజకవర్గంలోకి వస్తుండడంతో మొత్తం ఖర్చును అక్కడి ఇన్‌చార్జి సునీల్‌కుమార్‌ భరించాలని తొలుత ‘బడా’ నాయకుడు సూచించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యే కానని, అంత మొత్తం భరించలేనని ఆయన వివరణ ఇచ్చుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తన నియోజకవర్గం వరకే ఖర్చు పెట్టుకునేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. మిగతా నియోజకవర్గాల్లోనూ ఆయా ఇన్‌చార్జులు ఖర్చు పెట్టుకుని ప్రజల్ని తరలించాలని ఆ బడా నేత సూచించారట. మొత్తం ఖర్చు ఆ బడా నాయకుడే భరిస్తారని అనుకున్నా.. ఆయన పట్టించుకోక పోవడంతో ‘ఐదేళ్ల పాటు మైన్స్‌లో, వైన్స్‌లో భారీగా దోచుకుని ఇప్పుడు అధినేత పర్యటన ఖర్చును విభజించడం ఏంట’ని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఆ బడా నాయకుడు కూడా తన నియోజకవవర్గంలో మాత్రమే ఖర్చు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు ఇన్‌చార్జి విజయానందరెడ్డి 2029 ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తుండడంతో ఆ దిశగా జనసమీకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి తన కొడుకు అభినయ్‌రెడ్డిని ఎలివేషన్‌ చేసుకునేందుకు నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మందితో వచ్చి బలప్రదర్శన చేయనున్నట్లు తెలుస్తోంది. మిగతావాళ్లు నామమాత్రంగా జనాల్ని తరలించే ప్రయత్నం చేస్తుండగా, నగరి నుంచి రోజా పాత్ర పెద్దగా లేనట్లు తెలుస్తోంది.

Updated Date - Jul 09 , 2025 | 01:15 AM