శ్రీవారి డాలర్ల కేసులో..
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:28 AM
19 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన కేసులోని ఆరోపణల నుంచి 15 మంది టీటీడీ అధికారులు, ఉద్యోగులు విముక్తి పొందారు
తిరుపతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీవారి డాలర్ల విక్రయ కౌంటర్‌లో అక్రమాలు జరిగాయంటూ 19 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన కేసులోని ఆరోపణల నుంచి 15 మంది టీటీడీ అధికారులు, ఉద్యోగులు విముక్తి పొందారు. మొత్తం 20 మందిపై ఆరోపణలు రాగా క్రిమినల్, శాఖాపరమైన విచారణల అనంతరం వీరిలో 15 మందిపై చర్యలు నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలువురు పదవీ విరమణ చేయగా, కొందరు మరణించారు కూడా. తిరుమల శ్రీవారి డాలర్ల విక్రయాల కౌంటర్‌లో 5 గ్రాముల బరువుండే 300 శ్రీవారి డాలర్లు అదృశ్యమయ్యాయని 2006లో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించింది. వాటి విలువను రూ.15.40 లక్షలుగా అంచనా వేసింది. ఈ మేరకు విచారణ జరిపి 20 మంది బాధ్యులంటూ టీటీడీకి నివేదిక అందించింది. అప్పట్లో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించగా, వాళ్లూ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారు. విజిలెన్స్, సీబీసీఐడీ నివేదికల ఆధారంగా ప్రభుత్వం సంబంధిత ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ.. ఆ బాధ్యతను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ్‌సకు అప్పగించింది. తొలుత కేసును అప్పటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సుభ్రేంద్రు భట్టాచార్యకు, తర్వాత మరో సభ్యుడు, రిటైర్డు ఐపీఎస్ అధికారి జె.సత్యనారాయణకు అప్పగించారు. గతేడాది జనవరిలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. విచారణలో 15 మంది ఉద్యోగులు, అధికారులపై ఆరోపణలు రుజువు కాలేదని నివేదికలో పేర్కొంది. వీరిపై చర్యలు నిలిపివేయాలని టీటీడీ ఈవో ప్రభుత్వాన్ని కోరగా.. ఆ మేరకు రెవెన్యూ శాఖ ఎఫ్‌ఏసీ ముఖ్య కార్యదర్శి వి.వినయ్‌చంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ 15 మంది వీరే
తిరుమల పేష్కార్ కార్యాలయ సూపరింటెండెంట్లు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఎ.రఘురామిరెడ్డి, ఇ.రామచంద్రారెడ్డి, ఏవీ రమణమూర్తి, డీఈవో ఆర్.రంగనాధాచారి, ఇన్‌స్పెక్షన్ విభాగం ఏఈవో కె.చిత్తరంజన్, సీనియర్ అసిస్టెంట్, ఎస్వీ ఆయుర్వేదిక్ ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.ఆంజనేయులు, సీనియర్ అసిస్టెంట్లు బి.మురళీకృష్ణమూర్తిరాజు, రావినూతల శ్రీరామ్, సూపరింటెండెంట్లు ఎం.వెంగన్న, కె.గోవర్ధన్, డిప్యూటీ ఈవో ఎన్.చెంచులక్ష్మి, సీనియర్ అసిస్టెంట్, బొక్కసం క్లర్క్ బీఆర్ గురురాజారావు, రిసెప్షన్ విభాగం డిప్యూటీ ఈవో ఆర్.ఉమాపతి, వైకుంఠం క్యూ కాంప్లెక్సు ఏఈవో, ఇన్‌స్పెక్షన్ విభాగం సూపరింటెండెంట్ ఎస్.గజపతి. వీరిలో గురురాజారావు, రావినూతల శ్రీరామ్ సర్వీసులో ఉన్నారు. మురళీకృష్ణమూర్తి రాజు, ఎం.వెంగన్న, ఏవీ రమణమూర్తి రిటైరై మరణించారు.