Share News

నలుగురు రెవెన్యూ అధికారులపై చర్యలు

ABN , Publish Date - Jun 12 , 2025 | 01:00 AM

నగరి మండలంలో ఒకప్పుడు పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లు, ఇద్దరు వీఆర్వోలపై చర్యలు తీసుకోమని రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై మేజర్‌ పెనాల్లీ ఇంపోజ్‌ (కఠిన చర్యలు) చేయమని సీసీఎల్‌ఏకు సిఫార్సు చేశారు.

నలుగురు రెవెన్యూ అధికారులపై చర్యలు

నగరిలో ప్రభుత్వ భూమిని కాపాడకపోవడమే కారణం

వెదురుకుప్పం, ఆర్‌సీపురం తహసీల్దార్లు, నగరి వీఆర్వో, ఓ రిటైర్డ్‌ వీఆర్వోలపై చర్యలకు ప్రభుత్వ ఆదేశం

చిత్తూరు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): నగరి మండలంలో ఒకప్పుడు పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లు, ఇద్దరు వీఆర్వోలపై చర్యలు తీసుకోమని రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై మేజర్‌ పెనాల్లీ ఇంపోజ్‌ (కఠిన చర్యలు) చేయమని సీసీఎల్‌ఏకు సిఫార్సు చేశారు. ఈ నలుగురిలో ప్రస్తుత ఆర్‌సీపురం తహసీల్దార్‌ వెంకటరమణ, వెదురుకుప్పం తహసీల్దార్‌ బాబు, నగరి వీఆర్వో దేవదాసు, రిటైర్డ్‌ వీఆర్వో సదాశివపిళ్లై ఉన్నారు. ఈ నలుగురికి చార్జ్‌ మెమోలను ఇచ్చి, విచారణాధికారిని నియమిస్తారు.ఆ తర్వాత మేజర్‌ చర్యలు (ఇంక్రిమెంట్లు కట్‌ అవడం, డిమోషన్‌ ఇవ్వడం వంటివి) తీసుకుంటారు. వీరిపై ఈ చార్జెస్‌ ఉన్నంతవరకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ లాంటివి అందవు.

అసలేం జరిగిందంటే..

2018-20 మధ్య నగరి మండలంలో చెరువు, కుంట, దారిని ఆక్రమించి టెంకాయ చెట్లను సాగు చేస్తున్నారని ఓ సర్పంచి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ నలుగురు అధికారులు లోకాయుక్త ఆదేశాల మేరకు అక్కడ పరిశీలించి, చెట్లను తొలగించామని రిపోర్టు ఇచ్చారు. లోకాయుక్తలో పనిచేసే రిటైర్డ్‌ డీఎస్పీని విచారణకు ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూసిన ఆయన చెట్లను తొలగించలేదని రిపోర్టు ఇచ్చారు. కచ్చితంగా రెండు నెలల్లో తొలగించమని లోకాయుక్త మళ్లీ ఆదేశించింది. ఆ తర్వాత పనిచేసిన మరో తహసీల్దార్‌ చెట్లను తొలగించి లోకాయుక్తకు ఫొటోలు, వీడియోలతో సహా నివేదిక అందించారు. దీంతో గతంలో స్పందించని నలుగురి గురించి లోకాయుక్త సీసీఎల్‌కు ఫిర్యాదు చేసింది. సీసీఎల్‌ గతేడాది చిత్తూరు ప్రస్తుత జేసీ విద్యాధరిని విచారించమని ఆదేశించింది. ఆమె నివేదిక ఆధారంగా బుధవారం రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయలక్ష్మి ఉత్తర్వులను జారీ చేశారు.

Updated Date - Jun 12 , 2025 | 01:00 AM