Share News

కార్మికశాఖ జేసీ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:07 AM

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో కర్నూలు కార్మిక శాఖ జాయింట్‌ కమిషనరు (జేసీ) ఇంట్లో ఏసీబీ తనిఖీలు

కార్మికశాఖ జేసీ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో కర్నూలు కార్మిక శాఖ జాయింట్‌ కమిషనరు (జేసీ) బాలు నాయక్‌ ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తిరుపతిలోని రాఘవేంద్రనగర్‌లో ఈయన నివాసం ఉంటున్నారు. ఈ ఇంటితో పాటు కర్నూలులోని కార్యాలయం, అద్దె ఇల్లు, కుటుంబీకులు, బంధువుల ఇళ్లు, అన్నమయ్య జిల్లాలోని పౌల్ర్టీ ఫారంతో పాటు తొమ్మిది ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేశారు. తిరుపతిలోని ఇంట్లో తిరుపతి ప్రాంతీయ అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ విమలకుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. బాలునాయక్‌ కుమారుడు నిర్వహిస్తున్న ఆర్‌సీ సర్జికల్‌ షాపులోనూ తనిఖీలు చేశారు. ఇంట్లో పలు కీలక రికార్డులు, బంగారు నగలు, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆయన స్వగ్రామమైన రాయచోటి సమీపంలోని బిడికి తాండా, రాయచోటి, మదనపల్లె, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇళ్లు, అపార్టుమెంట్లు, పౌల్ర్టీ ఫారాలు, భూములకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సంబేపల్లిలో ఆయనకు పౌల్ర్టీఫారం ఉన్నట్లు గుర్తించారు. వివిధ బ్యాంకు ఖాతాల గురించీ ఆరా తీశారు. కర్నూలు కేంద్రంగా కార్యాలయం వున్నప్పటికీ తిరుపతిలోని ఇంటి నుంచే అన్ని కార్యకలాపాలు నిర్వహించే వారని ఆరోపణలున్నాయి. కాగా, స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్లు, కీలక రికార్డులనులోతుగా పరిశీలిస్తున్నారు. ఈ సోదాలు శనివారం కూడా కొనసాగనున్నాయని ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ చెప్పారు.

Updated Date - Aug 23 , 2025 | 12:07 AM