రవికుమార్ ఆస్తులపై ఏసీబీ ఆరా
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:20 AM
టీటీడీ పరకామణి చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. అతని ఇళ్లు, వ్యాపార లావాదేవీలు, స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
రిజిస్ర్టేషన్ కార్యాలయాల నుంచి వివరాలు తెప్పించే పనిలో అధికారులు
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 22(ఆంధ్రజ్యోతి): టీటీడీ పరకామణి చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. అతని ఇళ్లు, వ్యాపార లావాదేవీలు, స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.తిరుపతి, చంద్రగిరి,విజయవాడ,హైదరాబాద్, తమిళనాడులోని చెన్నైతోపాటు మరో ఐదు ప్రాంతాల్లో, కర్ణాటకలోని ధార్వాడ్, హుబ్లీ, బెంగళూరుల్లో భారీఎత్తున ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది.ఈ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. భూములు, ప్లాట్లు, మామిడి తోపులు, అపార్టుమెంట్లు, విల్లాలు, ఇతర చరాస్తులు ఎవరి పేర్లతో ఉంచాడు? బినామీలు ఎవరు? ఇతని వెనుక వుండి కథ నడిపించిన సూత్రధారులు ఎవరు అనే వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని రిజిస్ర్టేషన్ కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
రేపటి నుంచి పునఃవిచారణ
పరకామణి కేసు వారం రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ డీజీ నేతృత్వంలో ప్రస్తుత దర్యాప్తు అధికారులతో పాటు అదనంగా మరో 10 మంది సీఐ, ఎస్‌ఐలను విచారణ నిమిత్తం నియమించారు. రవికుమార్‌తో పనిచేసిన సిబ్బందితో పాటు కొంతమంది టీటీడీ పెద్దలను తిరుపతి పద్మావతి అతిథిగృహంలో విచారించనున్నారు. మాజీ సీవీఎస్వో నరసింహ కిషోర్‌ను కూడా విచారించే అవకాశముంది.