Share News

బక్కచిక్కిన ఏసీబీ

ABN , Publish Date - Jun 25 , 2025 | 01:26 AM

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలన.. ప్రతి పనికీ చేతులు చాపే అధికారులపై కొరడా ఝుళిపించాల్సిన అవినీతి నిరోధక శాఖ సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. అన్ని క్యాడర్లలో కలుపుకొంటే సగం మందే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి నిరోధక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తిరుపతి ప్రాంతీయ అవినీతి నిరోధక శాఖకు ఏఎస్పీ పోస్టును చాలా కాలం ఖాళీగా ఉంచారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏసీబీ అదనపు ఎస్పీగా విమలకుమారిని నియమించింది.

బక్కచిక్కిన ఏసీబీ

- పరిధి ఎక్కువ.. సిబ్బంది తక్కువ

(తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి)

శాఖ: అవినీతి నిరోధక విభాగం

పరిధి: తిరుపతి, చిత్తూరు జిల్లాలు

సిబ్బంది: 44కిగాను ఉండేది 24 మందే

సమస్య: సకాలంలో కేసులు ఛేదించలేకపోవడం. అవినీతి అధికారులపై నిఘా ఉంచలేకపోవడం.

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలన.. ప్రతి పనికీ చేతులు చాపే అధికారులపై కొరడా ఝుళిపించాల్సిన అవినీతి నిరోధక శాఖ సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. అన్ని క్యాడర్లలో కలుపుకొంటే సగం మందే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి నిరోధక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తిరుపతి ప్రాంతీయ అవినీతి నిరోధక శాఖకు ఏఎస్పీ పోస్టును చాలా కాలం ఖాళీగా ఉంచారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏసీబీ అదనపు ఎస్పీగా విమలకుమారిని నియమించింది. అవినీతిపరులపై దృష్టి పెట్టారు. అయితే అవినీతి కేసుల్లో రోజు, రోజుకూ ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. కానీ వాటిని ఛేదించి, కేసులు నమోదు చేయడానికి అవసరమైన అధికారులు, సిబ్బంది కొరత తీవ్రంగా పీడిస్తోంది. ఫిర్యాదులు అందినప్పుడు పరుగులు పెట్టి లంచావతారులను ప్రత్యక్షంగా చూసి పట్టుకోవాల్సిన సమయంలో సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి పదవీ విరమణ జరిగాక.. ఆ స్థానంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కావడం లేదు. తిరుపతి ప్రాంతీయ అవినీతి నిరోధక శాఖలో ముగ్గురు డీఎస్పీలు ఉండాలి. కానీ, ఇక్కడ పనిచేసేది ఒకే ఒక మహిళా డీఎస్పీనే. ఎక్కడైనా కేసులు తగిలి ఫిర్యాదులు అందితే పొరుగు జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అవినీతిపై ఫిర్యాదులెన్నో?

జిల్లాలో అధికారుల అవినీతిపై ఏసీబీకి ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. నెలకు సరాసరి 10 నుంచి 15 ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసింది. వాటిపై నిఘా ఉంచి బాధితులకు న్యాయం చేయాలంటే ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం వుంది. ఇక, రాష్ట్రంలోనే ముఖ్య పుణ్యక్షేత్రమైన తిరుపతిలో సొంత జాగా తీసుకుని ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికీ వుంది. అటువంటి సమయంలో స్థలం కొని ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్‌ అప్రూవల్‌ తప్పనిసరి. దీనికోసం కార్పొరేషన్‌ నగర ప్రణాళికా విభాగం అధికారులను సంప్రదించాలి. అక్కడా డబ్బులు పెడితే కానీ పని కావడం లేదని కొందరు బాధితులు విమర్శిస్తున్నారు. ఇక, పోలీసు, రెవెన్యూ, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలతో పాటు ట్రెజరీ, మైన్స్‌, సివిల్‌ సప్లయిస్‌ విభాగాల్లో కొందరు సిబ్బందికి చేతులు తడపందే పని కావడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లోనూ చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి వారిపై నిఘా పెట్టి, అవినీతి దందాను అరికట్టాలంటే ఏసీబీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

కదలని పాత కేసులు

తిరుపతి ప్రాంతీయ అవినీతి నిరోధక శాఖలో పదేళ్ల కిందట నమోదైన కేసుల్లో కొన్నింటికి అతీగతి లేదని తెలుస్తోంది. కనీసం కొన్ని కేసులకు సంబంధించి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయలేని పరిస్థితి ఉన్నట్లు సమాచారం. గతంలో కొన్ని కేసులకు ఛార్జిషీట్లు దాఖలు చేయకపోవడంతో నిందితులు అరెస్టయి బెయిల్‌పై బయటకు వస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో కొందరు నాయకుల అండదండలతో మంచి పోస్టింగ్‌ తెచ్చుకున్నారు.

ఏసీబీలో మంజూరైన.. ఖాళీ పోస్టుల వివరాలివీ

క్యాడర్‌ మంజూరైన పోస్టులు ఖాళీగా వున్న పోస్టులు

అదనపు ఎస్పీ 1 -

డీఎస్పీలు 3 2

సీఐలు 6 4

ఎస్‌ఐలు 3 1

హెడ్‌ కానిస్టేబుళ్లు 6 5

కానిస్టేబుళ్లు 25 12

Updated Date - Jun 25 , 2025 | 01:26 AM