మహిళకు మొదటి అవకాశం
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:01 AM
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా టీడీపీ మొదటిసారిగా ఓ మహిళకు అవకాశం కల్పించింది. కేంద్ర మాజీ మంత్రి, టీటీడీ పాలకమండలి సభ్యురాలు పనబాక లక్ష్మిని ఈ పదవికి ఎంపిక చేసింది. ప్రధాన కార్యదర్శిగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని నియమించింది.
టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి
కార్యదర్శిగా దివాకర రెడ్డి
తిరుపతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా టీడీపీ మొదటిసారిగా ఓ మహిళకు అవకాశం కల్పించింది. కేంద్ర మాజీ మంత్రి, టీటీడీ పాలకమండలి సభ్యురాలు పనబాక లక్ష్మిని ఈ పదవికి ఎంపిక చేసింది. ప్రధాన కార్యదర్శిగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని నియమించింది.అధ్యక్ష పదవిని పలువురు ఆశించినప్పటికీ పనబాక లక్ష్మి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అమెకున్న విస్తృత పరిచయాలను దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం ఆమె పేరును ఖరారు చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మహిళా సారథి ఎప్పుడూ లేరు. పార్లమెంటు నియోజకవర్గ కమిటీల విధానం వచ్చిన తర్వాత తిరుపతి నియోజకవర్గంలో ఎస్సీల జనాభా ఎక్కువ వుండడం, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు అసెంబ్లీ స్థానాలు ఎస్సీ రిజర్వుడు సెగ్మంట్లే కావడాన్ని దృష్టిలో పెట్టుకుని పనబాక లక్ష్మిని ఎంపిక చేసినట్టుగా భావిస్తున్నారు.తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో మరో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందన్న చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన దివాకర్ చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల గెలుపుకోసం పనిచేశారు. యువనేత లోకేశ్‌కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు.ఇటీవల క్యాబినెట్ హోదా కలిగిన తుడా ఛైర్మన్‌గా నియమితులయ్యారు.అక్కడ తనదైన ముద్రవేయడంతో పాటు పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా కనిపిస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న అఽధిష్ఠానం ప్రధాన కార్యదర్శిగా నియమించిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తా
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తా. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరే విధంగా కృషి చేస్తా. నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు , లోకేష్, పల్లా శ్రీనివా్‌సలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
- పనబాక లక్ష్మి
సమన్వయంతో ముందుకెళతా
ఘన చరిత్ర కలిగిన టీడీపీకి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉంది. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా ప్రతి అడుగూ ఉంటుంది. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతా.నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు, లోకేశ్ , పల్లా శ్రీనివాస్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా.
-దివాకర రెడ్డి