తోతాపురి టన్ను రూ.12 వేలు
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:41 AM
మామిడి రైతులతో పాటు గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తోతాపురి రకం టన్ను ధర రూ. 12 వేలుగా కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రకటించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశానికి వర్చువల్ విధానంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న తోతాపురి రకానికి గిట్టుబాటు ధర కోసం మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమల్లో సమస్యల గురించి వాటి యాజమాన్య ప్రతినిధులు తెలియజేశారని చెప్పారు.
మద్దతు ధర ప్రకటించిన కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతులతో పాటు గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తోతాపురి రకం టన్ను ధర రూ. 12 వేలుగా కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రకటించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశానికి వర్చువల్ విధానంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న తోతాపురి రకానికి గిట్టుబాటు ధర కోసం మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమల్లో సమస్యల గురించి వాటి యాజమాన్య ప్రతినిధులు తెలియజేశారని చెప్పారు. రెండు వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టన్ను రూ.12వేలుగా నిర్ణయించడం జరిగిందని చెప్పారు. రైతుల కష్టాలను గుర్తించి, వారినుంచి మామిడి కొనుగోలు చేయాలని గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలకు కలెక్టర్ సూచించారు. చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ మాట్లాడుతూ తోతాపురికి గిట్టుబాటు ధర కల్పించే అంశంలో రైతులకే తొలిప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.అయితే పరిశ్రమల మేలు కూడా అవసరమంటూ రెండు వర్గాలనూ సమావేశపరిచి చివరికీ ధరను కలెక్టర్ నిర్ణయించినట్లు చెప్పారు.పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఇరువర్గాలూ పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.గుజ్జుపరిశ్రమల యాజమాన్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ మామిడి గుజ్జుకు డిమాండ్ తగ్గిందని ప్రాసెసింగ్ కంపెనీల్లో నిల్వలు పెరిగిపోయాయని వివరించారు.ఎల్డీఎం హరీష్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు,ఉద్యానశాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.