Share News

మహిళల ఆరోగ్యంతోనే బలమైన కుటుంబం

ABN , Publish Date - Sep 18 , 2025 | 01:14 AM

ఆరోగ్యవంతమైన మహిళలతోనే బలమైన కుటుంబ నినాదంతో ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ అన్నారు.

మహిళల ఆరోగ్యంతోనే బలమైన కుటుంబం
పోస్టర్లను విడుదల చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

తిరుపతి(వైద్యం), సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యవంతమైన మహిళలతోనే బలమైన కుటుంబ నినాదంతో ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ అన్నారు. నరసింహతీర్థం వీధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌(మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు) కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలిసి ఆయన పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య భద్రత కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల పరిధిలో 536 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆయుష్మాన్‌ ఆరోగ్య కార్డులను అందించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలు ఇంటి బాధ్యతలతోపాటు విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నందున వారి ఆరోగ్యాన్ని కాపాడటం ఎంతో ముఖ్యమన్నారు. గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ చైర్మన్‌ సుగుణమ్మ, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహయాదవ్‌ ఇటువంటి కార్యక్రమాలతో మహిళల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలను వివరించారు. డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్‌ మాట్లాడుతూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ వసంతబాయి, కార్పొరేటర్లు సీకే రేవతి, కల్పన, బీజేపీ నేతలు సుచరిత, అజయ్‌, వైద్యాధికారులు కృష్ణకుమారి, హేమలత, మురళీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 01:14 AM